ఇసుకరేవు గుంతలో పడి ఒకరి దుర్మరణం

అనంతపురం జిల్లాలో వైకాపా నాయకుల ధనదాహానికి నిండుప్రాణం బలైంది.

Published : 29 Feb 2024 05:02 IST

అడ్డగోలు తవ్వకాలకు వైకాపా నాయకుల ధనదాహమే కారణమని స్థానికుల ధ్వజం

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లాలో వైకాపా నాయకుల ధనదాహానికి నిండుప్రాణం బలైంది. తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరులోని పెన్నా నది ఇసుక రేవులో వైకాపా నాయకులు నిబంధనలకు విరుద్ధంగా తవ్విన గుంతలో పడి అదే గ్రామానికి చెందిన చిన్నఓబులేసు (70) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నఓబులేసు రజక వృత్తిపై ఆధారపడి ఒంటరిగా జీవిస్తున్నారు. మంగళవారం గ్రామ సమీపంలోని ఇసుకరేవు నిర్వహించిన గుంత వద్దకు దుస్తులు ఉతకడానికి వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు పడి చనిపోయారు. బుధవారం మృతదేహం తేలాడుతుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వైకాపా నాయకులు గ్రామ సమీపంలో ఇసుక రేవు నిర్వహించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోతు తవ్వడంతోనే చిన్నఓబులేసు మృతి చెందారని స్థానికులు వివరిస్తున్నారు. గ్రామ సమీపంలో రెండు కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున గుంతలున్నాయని వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని