‘గ్రూప్‌-1’ ఉద్యోగాల పేరిట టోకరా!

నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్‌-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది.

Published : 28 Mar 2024 03:17 IST

నలుగురు సభ్యుల ముఠా మోసం
మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద రూ. 2.50 కోట్ల వసూలు

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్‌-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోట్లలో వసూలు చేసినట్లు వరంగల్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వరంగల్‌కు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు (వీరిలో ఓ మహిళ) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తమకు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, ‘గ్రూప్‌-1’ పరీక్ష మొదలుకొని ఉద్యోగం వచ్చేవరకు అన్నీ తాము చూసుకుంటామని చెప్పి పలువురిని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పోలీసు అధికారి పోస్టులు సైతం ఇప్పించామని ముఠా సభ్యులు ప్రచారం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఉన్న ఫొటోలను చూపిస్తూ పలువురిని నమ్మించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, కరోనా సమయంలో మృతిచెందిన ఓ పోలీసు అధికారి కుమారుడికి గ్రూప్‌-1 డీఎస్పీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ముఠా.. ఆ కుటుంబ సభ్యుల నుంచి ఏడాది కిందట దశల వారీగా రూ.2.50 కోట్లు వసూలు చేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు నిలదీయగా ముఠా సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో విశ్రాంత పోలీసు అధికారి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల దర్యాప్తు..

పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో వరంగల్‌ కమిషనరేట్‌లోని ప్రత్యేక విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నారు. నిందితులు నలుగురూ ఇటు వరంగల్‌, అటు హైదరాబాద్‌లో కూడా లేరని, ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని పట్టుకుంటే ఎంతమంది నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు? వారి వెనుక ఇంకా ఎవరున్నారో తెలుస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని