పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా

తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Published : 28 Mar 2024 06:30 IST

ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు

జోగిపేట, జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు 30 మంది బంధువులు ఒకే ట్రాక్టర్‌లో బయల్దేరగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. డ్రైవర్‌ మినహా మిగతావారికి గాయాలయ్యాయి. జోగిపేట ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్‌కు సంగారెడ్డి జిల్లా అందోలుకు చెందిన మమతతో వివాహం నిశ్చయమైంది. గురువారం(28న) బాచారంలో పెళ్లి జరగాల్సి ఉంది. బాచారానికి చెందిన 30 మంది బంధువులు పెళ్లి కుమార్తెను తీసుకెళ్లడానికి బుధవారం ట్రాక్టర్‌లో అందోలుకు బయల్దేరారు. అందోలు మండలం మన్‌సానిపల్లి మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడింది. వాహనంలోని వారంతా కింద పడిపోయారు. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జట్టిగారి సంగమ్మ(47), రావుగారి బూదెమ్మ(50), ఆగమ్మ(50) మృతి చెందారు. క్షతగాత్రుల్లో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని