ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Published : 28 Mar 2024 03:22 IST

ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టుల మృతి

దుమ్ముగూడెం, చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నిఘావర్గాల సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా, డీఆర్జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) బెటాలియన్లు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఉదయం 8గంటల సమయంలో తాల్పేర్‌ నది శివారులో మావోయిస్టుల సమావేశం జరుగుతోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య దాదాపు మూడు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ప్లాటూన్‌ నంబర్‌-10కి చెందిన మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ నగేష్‌(40)అతని భార్య సోనీ(35), మిలీషియా డివిజనల్‌ అధ్యక్షుడు వికాస్‌(38), ఏరియా కమిటీ మహిళా సభ్యురాలు గంగీ(30), మిలీషియా సెక్షన్‌ కమాండర్‌ ముక్కా(37), మిలీషియా కమాండర్‌ చుక్కా(36) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారు అటవీ ప్రాంతాల మీదుగా తప్పించుకొని పోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన తుపాకులు, పేలుడు పదార్థాలు, కిట్‌ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనను బీజాపూర్‌ ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ ధ్రువీకరించారు.

ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్‌ చేపట్టి..

మూడు రోజుల కిందట ఇదే ప్రాంతంలో  హోలీ ఆడుకుంటున్న యువకులపై పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి ముగ్గురిని హత్య చేశారు. బీజాపూర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టులు ముగ్గురిని హత్య చేయడం, ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఆపరేషన్‌ చేపట్టి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీశారు. బీజాపూర్‌ జిల్లాలో పది రోజుల వ్యవధిలో పలువురు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని