అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు.

Updated : 28 Mar 2024 03:45 IST

21 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి జనగామకు వలస

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. అప్పడాలు తయారు చేసి విక్రయించే సెల్వరాజ్‌(55), భాగ్యలక్ష్మి(45) దంపతులు 21 సంవత్సరాల క్రితం జనగామకు వచ్చి స్థిరపడ్డారు. స్థానిక వీవర్స్‌ కాలనీలో ఇళ్లు కొనుగోలు చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా... అందరికీ వివాహాలు జరిగాయి. సెల్వరాజ్‌ వ్యాపారం కోసం ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.15 లక్షలు, వడ్డీ వ్యాపారుల దగ్గర రూ.35 లక్షల అప్పు చేశారు. వ్యాపారం సరిగ్గా నడవక నష్టాలు రావడంతో కుటుంబంలో కలహాలు పెరిగాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గొడవపడిన దంపతులు.. ఆవేశంలో ఇంట్లో ఉన్న పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందారని సీఐ తెలిపారు. పక్క వీధిలో ఉంటున్న వారి కుమారుడు పళనిస్వామికి స్థానికులు ఈ విషయం తెలపడంతో.. ఆయన మరో సోదరుడితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుల బాధతో తరచూ గొడవ పడి తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇద్దరు కుమారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని