నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు

వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు.

Updated : 29 Mar 2024 06:56 IST

కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. ఈ విషయంలో నిందితుడిని పోలీసులు కాపాడే యత్నం చేస్తున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు ప్రభుత్వ మద్యం దుకాణానికి బుధవారం గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నకిలీ రూ.500 నోటుతో మద్యం కొన్నాడు. బుధవారం నాటి నగదును గురువారం బ్యాంకులో జమ చేస్తుండగా అధికారులు నకిలీ నోటు గుర్తించి, దుకాణ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో దుకాణ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గురువారం యడ్లపాడు మండలం కారుచోలకు చెందిన వైకాపా నేత బావమరిది షేక్‌ ఖాజా దుకాణానికి వచ్చి రూ.500 నోటు ఇచ్చాడు. సిబ్బంది అది నకిలీ నోటుగా గుర్తించి, వెంటనే ఖాజాను పట్టుకున్నారు.  అతడి జేబులు సోదా చేసి, ఏడు నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

పక్కదోవ పట్టిస్తూ..: నిందితుడు వైకాపా నేతకు బంధువు కావడంతో.. అతడు ఇచ్చింది నకిలీ నోటు కాదని చెల్లని(చిరిగిన) నోటని చెబుతూ పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారు. వారే స్వయంగా మద్యం దుకాణ సిబ్బందికి ఫోన్‌ చేసి ‘నకిలీ నోట్ల విషయం ఎవరికీ చెప్పొద్దు, వెంటనే స్టేషన్‌కు రావాలి’ అని చెప్పారని తెలిసింది. పైగా దీనిపై ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఖాజా మద్యం దుకాణానికి వెళుతుండగా.. అతడికి రోడ్డు పక్కన చెల్లని నోటు దొరికింది. దాన్ని అతడు దుకాణంలో ఇచ్చారు’ అని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని