రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో తనిఖీలు

బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్‌ మెరైన్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు.

Published : 29 Mar 2024 05:43 IST

రూ.56 లక్షల నగదు స్వాధీనం
బాపట్ల తెదేపా అభ్యర్థి లక్ష్యంగా దాడులు

బాపట్ల, చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్‌ మెరైన్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్యాక్టరీలో పెద్దఎత్తున నగదు ఉన్నట్లు ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారం వచ్చిందని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం సంస్థ కార్యాలయం వద్ద తనిఖీలు చేసింది. ఓ రొయ్యల కంటెయినర్‌లో అట్టపెట్టెలో దాచి ఉంచిన రూ.56 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నెలాఖరు కావడంతో ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు నగదు తెచ్చినట్లు అధికారులకు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంబంధిత పత్రాలను అందజేశారు. రూ.10లక్షలకు మించి నగదు లభ్యం కావడంతో పోలీసులు ఆదాయపన్ను విభాగం అధికారులకు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఆదాయపన్ను విభాగం అధికారుల విచారణ ముగిసేవరకు నగదును చీరాల ఎస్టీఓ కార్యాలయంలో జమ చేయాలని నిర్ణయించారు.

ఒక్క సంస్థలోనే తనిఖీలపై చర్చ

రాయల్‌ మెరైన్‌ కంపెనీలో తెదేపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ ఓ భాగస్వామి. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో నాలుగు యూనిట్లు నడుస్తుండగా.. ఒక్క తెదేపా అభ్యర్థి సంస్థపైనే దాడులు చేయడం చర్చనీయాంశం అయింది. నరేంద్రవర్మ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు రాజకీయవర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల మేరకు తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. కంపెనీ ఏ పార్టీకి చెందినదో తమకు సంబంధం లేదన్నారు.

అన్ని పత్రాలూ అందజేశాం

నగదుకు సంబంధించి అన్ని పత్రాలూ అధికారులకు అందజేశామని సంస్థ ప్రతినిధి విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇది ఎన్నికల నగదు కాదని, వేతనాలకు సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అన్ని ఆధారాలు చూపించి నగదును రెండు, మూడు రోజుల్లో తిరిగి తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని