నకిలీ వైద్యులు.. అనుమతుల్లేని క్లినిక్‌లు!

వారు అసలు వైద్యులే కాదు.. ఎంబీబీఎస్‌ పట్టానే ఉండదు.. అయినా వైద్యుల పేరుతో చలామణి అవుతున్నారు. ఏకంగా క్లినిక్‌లు తెరిచి అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేస్తున్నారు.

Published : 30 Mar 2024 04:43 IST

పలు ప్రాంతాల్లో డీసీఏ కేసుల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: వారు అసలు వైద్యులే కాదు.. ఎంబీబీఎస్‌ పట్టానే ఉండదు.. అయినా వైద్యుల పేరుతో చలామణి అవుతున్నారు. ఏకంగా క్లినిక్‌లు తెరిచి అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ వైద్యులను తాజాగా ఔషధ నియంత్రణ శాఖ (డీసీఏ) గుర్తించింది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం మీడియాకు డీసీఏ వివరాలు వెల్లడించింది. ఖమ్మం జిల్లా పొలంపల్లి గ్రామంలో ఇసల రాజు, సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‌కు చెందిన మింతు బాల, నిజామాబాద్‌ మంచిప్ప గ్రామానికి చెందిన శ్యాంగౌడ్‌, వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వి.శ్రీకాంత్‌ కొంతకాలంగా క్లినిక్‌లు తెరిచి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరందరికీ ఎలాంటి అర్హత లేకున్నా రూరల్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌గా చలామణి అవుతున్నారు. మందులను సైతం విక్రయిస్తున్నారు. అవసరం లేకున్నా పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌, స్టెరాయిడ్లు రోగులకు అంటగడుతున్నారు. కొందరు హోల్‌సేల్‌ డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా ఈ నకిలీ వైద్యులకు మందులను సరఫరా చేస్తున్నట్లు డీసీఏ గుర్తించింది. దాదాపు రూ.3.18 లక్షల విలువైన మందులను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. చట్టపరంగా వీరందరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని