ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నయవంచన!

గ్రూప్‌-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు.

Updated : 30 Mar 2024 06:19 IST

సొమ్ము తీసుకుని మోసం చేసిన నిందితుడి అరెస్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: గ్రూప్‌-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. శుక్రవారం సుబేదారి ఠాణాలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్‌ పిన్నావారి వీధికి చెెందిన కొత్త వీరేశం ప్రస్తుతం హైదరాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌పల్లి అశ్వినీకాలనీలో నివాసం ఉంటున్నాడు. హనుమకొండ కనకదుర్గ కాలనీకి చెందిన విశ్రాంత అదనపు ఎస్పీ భాస్కర్‌రావు (కరోనా సమయంలో మృతి చెందారు) కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2020 నుంచి ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యుల నుంచి రూ.2.50 కోట్ల నగదు తీసుకున్నాడు. ఇలాగే వీరేశం పలువురి నుంచి రూ.4.50 కోట్ల వరకు డబ్బు వసూలు చేశాడు. కానీ ఎవరికీ ఉద్యోగం ఇప్పించలేదు. డబ్బు వెనక్కి ఇవ్వలేదు. భాస్కర్‌రావు సతీమణి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... కోర్టు ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం హనుమకొండ అదాలత్‌ వద్ద వీరేశంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో వీరేశం ఉంటున్న ఇంట్లో గాలించగా.. సెల్‌ఫోన్‌, 200 గ్రాముల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు, పది గ్రాముల బంగారు నాణెం, 45 గ్రాముల బంగారు గొలుసు, ఆరు ప్రామిసరీ నోట్లు, ఆరు చెక్కులు, రూ.71 వేల నగదు, పాస్‌పోర్టులు దొరికినట్లు ఏసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.

 

నమ్మించి.. ఇలా వంచించి..

కొత్త వీరేశంను వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన బోయినపల్లి రవీందర్‌రావు హైదరాబాద్‌కు చెందిన గూడూర్‌ పవన్‌కుమార్‌కు పరిచయం చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్న పవన్‌కుమార్‌ మామ వీరిని కళాశాల యజమానికి పరిచయం చేశారు. కళాశాల యజమానికి అప్పటి ప్రభుత్వ పెద్దల వద్ద మంచి పేరుండడంతో అతని ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరేశం, గూడూర్‌ పవన్‌కుమార్‌ నిరుద్యోగులను నమ్మించసాగారు. వీరితోపాటు వీరేశం కుమారుడు గోపీనాథ్‌, పవన్‌కుమార్‌ భార్య పద్మజ కూడా మోసాల్లో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి చెందిన బుచ్చిబాబు, అలియాస్‌ బుచ్చయ్య ద్వారా కూడా నిరుద్యోగులను నమ్మించి డబ్బు తీసుకున్నారు. వీరేశం చెప్పిన వివరాల ప్రకారం.. గూడూర్‌ పవన్‌కుమార్‌, గోపీనాథ్‌, పద్మజ, రవీందర్‌రావు, ఖమ్మం పట్టణానికి చెందిన ఉట్కూరి శ్రీనివాస్‌రావు, ప్రకాశం జిల్లాకు చెందిన బుచ్చిబాబు, వీరేశం భార్య అరుంధతి, కుమార్తె పూజితలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్‌ఫోర్స్‌, సుబేదారి పోలీసులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ ఝా అభినందించారు. విలేకరుల సమావేశంలో సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ఎస్సై సాంబయ్య, కానిస్టేబుళ్లు సుమన్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని