లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి.. విశాఖ మధురవాడలో దారుణం

‘‘నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే..? ఈ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా.. అని మీరు అనొచ్చు.

Updated : 30 Mar 2024 09:35 IST

వసతిగృహం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
ఈనాడు-విశాఖపట్నం, పీఎంపాలెం-న్యూస్‌టుడే


‘‘నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే..? ఈ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా.. అని మీరు అనొచ్చు. కానీ వారే దానికి పాల్పడుతుంటే ఇంకెవరికి చెప్పగలం. చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నాలాగే చాలామంది అమ్మాయిలు ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే మా ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో మాలో ఎవరో ఒకరు చనిపోతే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలుస్తుంది. అందుకే ఆ పని నేనే చేస్తున్నా. నాన్నా.. నీకు ఒక మంచి కుమార్తెను కాలేకపోయినందుకు క్షమించు’’

ఇదీ ఆత్మహత్య చేసుకునే ముందు తన అక్కకు పంపిన వాట్సప్‌ మెసేజ్‌లో యువతి తెలిపిన వివరాల సారాంశం.


విశాఖ మధురవాడ సమీపంలో ఉన్న ఓ విద్యా సంస్థలో లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పీఎంపాలెం సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలిలా.. కొమ్మాదిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ (సీఎంఈ) మొదటి సంవత్సరం విద్యార్థిని(17) గురువారం అర్ధరాత్రి దాటాక కళాశాల వసతిగృహం నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రక్తం మడుగులో పడి ఉన్న ఆమెను సిబ్బంది ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తండ్రి అనకాపల్లి జిల్లా నాతవరం మండలానికి చెందిన వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తెకు వివాహమైంది. రెండో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని. చిన్న కుమార్తె 8వ తరగతి చదువుతోంది. మృతురాలి సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసి అందులోని డేటాతోపాటు, కళాశాల సీసీ టీవీ ఫుటేజీలు సేకరించామని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

అమ్మా.. నాన్న.. మీ ఆరోగ్యం జాగ్రత్త

ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు విద్యార్థిని తన అక్కతో వాట్సప్‌లో చాట్‌ చేస్తూ.. కొన్ని మెసేజ్‌లు పంపింది. తాను చదువుతున్న కళాశాలలో బోధన సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అందువల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వాటిలో తెలిపింది. ‘నువ్వు తొందరపడి ఏమీ చేసుకోకు..’ అని అక్క ధైర్యం చెబుతూ అర్ధరాత్రి 1.01 గంటలకు చివరిగా బదులిచ్చినా.. ఆ తర్వాతే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా.. నాన్న.. మీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కా-బావకు అభినందనలు. అక్కా.. పండంటి బిడ్డకు జన్మనివ్వు. చెల్లీ.. నీ ఫ్యూచర్‌పై ఫోకస్‌ పెట్టు. స్టడీలో నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి’’ అంటూ విద్యార్థిని చివరిగా పంపిన మెసేజ్‌ చూపుతూ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ కేజీహెచ్‌ శవాగారం వద్ద వారు ఆందోళన చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, సత్వరం నివేదిక అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ వద్ద ప్రస్తావించగా.. విద్యార్థినిపై వేధింపులేవీ జరగలేదని, తరగతిలో పాఠాలు అర్థం కావడం లేదని తనకు పలుమార్లు చెప్పిందన్నారు. ఆమె చదివే తరగతిలో ఇద్దరు తప్పితే, మిగిలిన వారంతా మహిళా సిబ్బందే బోధిస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని