జాతీయ రహదారిపై లారీ బీభత్సం

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని లంకెలపాలెం జాతీయ రహదారి కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 30 Mar 2024 04:48 IST

8 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం

పరవాడ, అగనంపూడి, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని లంకెలపాలెం జాతీయ రహదారి కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, భారీ లోడ్‌తో వెళుతున్న బొగ్గు లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపై దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో లంకెలపాలెం కూడలి వద్ద రెడ్‌సిగ్నల్‌ పడటంతో ఒక ఆటో, రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, వీటి వెనుక ట్రాక్టరు ఆగి ఉన్నాయి. గంగవరం పోర్టు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న బొగ్గు లారీ అతివేగంగా రావడంతోపాటు బ్రేకులు పడక తొలుత ట్రాక్టరు తొట్టెను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు ముందున్న కారుపైకి దూసుకుపోయింది. లారీ అక్కడితో ఆగకుండా ఎడమవైపున ఉన్న కారు, రెండు ద్విచక్రవాహనాలు, ప్యాసింజర్‌ ఆటోపైకి దూసుకెళ్లింది. ఆటో వెనుకభాగంలో డబ్బాల్లో ఉన్న యాసిడ్‌ నేలపాలై పొగలు వ్యాపించి స్థానికులు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షతగాత్రుల్లో యువ దంపతులతో సహా ఒక గర్భిణి ఉన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని