భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విశ్లేషణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించడంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది.

Updated : 31 Mar 2024 07:05 IST

వాటిలోని డేటా రిట్రీవ్‌కు ప్రయత్నం
 ఫోన్‌ ట్యాపింగ్‌ నిరూపణలో సాంకేతిక ఆధారాలే కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించడంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఇంటెలిజెన్స్‌లో పని చేసిన భుజంగరావు, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన తిరుపతన్నకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను పోలీసు అధికారులు ఇప్పటికే జప్తు చేశారు. వాటితోపాటు వారి సెల్‌ఫోన్లలోని డేటాను విశ్లేషించే పనిని వేగవంతం చేస్తున్నారు. ట్యాపింగ్‌ అంశాన్ని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాల సేకరణ అవశ్యంగా మారడంతో ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. ఆయా ఉపకరణాల్లోని డేటాను చాలావరకు ముందే తొలగించి ఉండటంతో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో రిట్రీవ్‌(తిరిగి పొందడం) చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిలోని డేటా లభిస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళ్లే వీలుంటుందని భావిస్తున్నారు.

ఎందుకు చేశారు.. ఎవరు చేయమన్నారు..?

మరోవైపు బంజారాహిల్స్‌ ఠాణాలో భుజంగరావు, తిరుపతన్నల విచారణను రెండో రోజు శనివారం కొనసాగించారు. ప్రధానంగా రాజకీయ నేతలు, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్‌ బాధ్యతను ప్రణీత్‌రావుకు అప్పగించాలని సూచించిందెవరు..? ట్యాపింగ్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారు..? అనే వాటిపై విచారణ సాగినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతోపాటు మరో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సూచనలతోనే తాము ఈ పనికి పాల్పడ్డామని వారిద్దరూ చెప్పినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాల్ని సేకరించడం ద్వారా ఈ అక్రమాన్ని నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. మరోవైపు 48 గంటలకుపైగా జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న కారణంగా వీరిద్దరి సస్పెన్షన్‌ అనివార్యమే అయినా ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు.

రాధాకిషన్‌రావు కస్టడీకి ప్రయత్నాలు

ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న రాధాకిషన్‌రావును కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో ఉంటూ పోలీసు వాహనాల్లో ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బు తరలింపుతోపాటు ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచడం లాంటి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన దర్యాప్తు బృందం మరిన్ని వివరాలు సేకరించడంపై దృష్టి సారించింది. సోమవారం ఆయన్ను కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు క్షేత్రస్థాయి పోలీసులను విచారించినప్పుడు అంతా రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకే చేశామని చెప్పినట్లు తేలడంతోనూ ఆయన్ను మరోసారి విచారించాలని నిర్ణయించారు. ప్రణీత్‌రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్‌రావు విదేశాలకు వెళ్లినట్లు తెలియడంతో దర్యాప్తును తప్పించుకునేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. అయితే బహ్రెయిన్‌లో ఓ శుభకార్యం నిమిత్తంవెళ్లి వచ్చినట్లుగా దర్యాప్తు బృందానికి ఆయన సమాచారమిచ్చినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని