మా జోలికొస్తే అంతుచూస్తాం

కొండపోరంబోకు స్థలంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయాన్ని తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై అధికార పార్టీ నాయకుడి అనుయాయులు దాడిచేశారు.

Published : 31 Mar 2024 04:39 IST

ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై  వైకాపా నాయకుడి అనుచరుల దాష్టీకం

అనకాపల్లి (లక్ష్మీదేవిపేట), న్యూస్‌టుడే: కొండపోరంబోకు స్థలంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయాన్ని తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై అధికార పార్టీ నాయకుడి అనుయాయులు దాడిచేశారు. వారి దాష్టీకానికి రెవెన్యూ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. అనకాపల్లి జిల్లా గోపాలపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 111లోని కొండపోరంబోకు స్థలంలో వైకాపా నాయకుడు దుకాణ సముదాయం నిర్మిస్తున్నారు. దీనిపై ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఆక్రమణలు తొలగించాలని తహసీల్దారు రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ముగ్గురు వీఆర్వోలు, 10 మంది వీఆర్‌ఏలు ఆక్రమణలు తొలగించడానికి పొక్లెయిన్‌తో వచ్చారు. దుకాణ సముదాయాన్ని పొక్లెయిన్‌తో తొలగిస్తుండగా ఒక్కసారిగా వైకాపా నాయకుడి మద్దతుదారులు, కుటుంబసభ్యులు అధికారులపై తిరగబడ్డారు. తీవ్రమైన పదజాలంతో దూషించారు. తమ ఆధీనంలోని భూమి జోలికొస్తే అంతుచూస్తామంటూ హెచ్చరించారు. వీఆర్వో వినోద్‌ చొక్కా పట్టుకొని దాడి చేశారు. మిగతావారంతా పరుగు తీశారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వీఆర్‌ఏ వీడియో తీశారు. దీనిపై తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది డిమాండు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని