కాళ్లపారాణి ఆరకముందే.. వధువు మృతి

అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో నాన్నమ్మ, తాతయ్య ఆమెను పెంచి పెద్దచేశారు. మనవరాలికి పెళ్లిచేసి ఓ అయ్య చేతిలో పెట్టామన్న వారి ఆనందం.. కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది.

Updated : 31 Mar 2024 05:47 IST

మక్కువ, సాలూరు, న్యూస్‌టుడే: అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో నాన్నమ్మ, తాతయ్య ఆమెను పెంచి పెద్దచేశారు. మనవరాలికి పెళ్లిచేసి ఓ అయ్య చేతిలో పెట్టామన్న వారి ఆనందం.. కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. వివాహమైన 12 గంటల్లోనే ఆ వధువు మృతిచెందింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలచి వేసింది. వివరాలివి.. పార్వతీపురం పట్టణం కొత్తవలసకు చెందిన వెత్సా అఖిల (20)కు తల్లిదండ్రులు లేరు. నాన్నమ్మ, తాతయ్య అయిన.. ఊళ్ల పుణ్యవతి, చిన సత్యనారాయణ వద్ద పెరిగింది. ఆమెకు మక్కువ మండలం దబ్బగెడ్డకు చెందిన యువకుడితో శుక్రవారం రాత్రి పది గంటలకు వివాహం జరిగింది. అనంతరం నీరసంగా ఉందని అఖిల నిద్రపోయింది. ఉదయం లేచి అల్పాహారం తీసుకున్న కొంతసేపటికి ఆమెకు వాంతులయ్యాయి. దీంతో కొద్దిసేపు నిద్రపోగా.. ఎంతకీ లేవకపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించిన కుటుంబసభ్యులు మక్కువ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు మహేశ్‌, లోక్‌నాయక్‌ నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకూ మృతికి కారణాలు చెప్పలేమని వైద్యులు తెలిపారు. వివాహం జరిగిన గంటల వ్యవధిలో వధువు ప్రాణాలు కోల్పోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. అఖిలకు పక్షవాతం సమస్య ఉందని.. నిద్రలో ఫిట్స్‌ వచ్చాయేమోనని నాన్నమ్మ, తాతయ్య చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని