మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి విశ్రాంత ఉద్యోగి హత్య.. బంగారు నగలు దోచుకున్న వైద్యుడు

ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్‌ ఇచ్చి వైద్యుడు హతమార్చాడు. ఆ పై ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఏలూరు శివారు చొదిమెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 01 Apr 2024 07:13 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్‌ ఇచ్చి వైద్యుడు హతమార్చాడు. ఆ పై ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఏలూరు శివారు చొదిమెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బత్తిన మల్లేశ్వరరావు (63) తపాలాశాఖలో ఉద్యోగవిరమణ పొందారు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్‌ ఎంబీబీఎస్‌ చదివి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావుతో సన్నిహితంగా ఉండేవాడు. గతంలో ఏలూరు త్రీటౌన్‌ పరిధిలో కొంతమందికి వైద్యం చేసే నెపంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాళ్లు మత్తులోకి వెళ్లాక వారి వద్దనున్న డబ్బు దోచుకునేవాడు. వారు కొన్ని రోజులు అస్వస్థతకు గురై కోలుకునేవారు. ఈ తరహా కేసులు అతనిపై ఏలూరు త్రీటౌన్‌, వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. మల్లేశ్వరరావునూ ఇదే తరహాలో చేయాలని భానుసుందర్‌ గత డిసెంబరు 24న ఆయన ఇంటికి వెళ్లాడు. ఆయన ఒక్కడే ఉండటంతో ఇంజక్షన్‌ చేశాడు. మల్లేశ్వరరావు మత్తులోకి జారగానే వైద్యుడు ఇంట్లోకి వెళ్లి బంగారు నగలు, కొంత నగదు అపహరించుకుపోయాడు. మల్లేశ్వరరావు కోలుకోలేక చనిపోవటంతో కుటుంబసభ్యులు తొలుత సహజమరణంగా భావించారు. ఆ తరువాత వైద్యుడు భానుసుందర్‌ ప్రవర్తనపై అనుమానం కలిగి నిలదీయగా అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. మృతుడి కుమారుడు సోమశేఖర్‌ ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని