12.88 లక్షల గోనె సంచులు బుగ్గిపాలు

వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్‌ యార్డులోని గోదాంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగి రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. యార్డులోని గోదాంలో రెండో కంపార్ట్‌మెంటును జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు లీజుకు తీసుకుని 12.88 లక్షల గోనె సంచులు(గన్నీ బ్యాగులు) నిల్వ చేశారు.

Published : 02 Apr 2024 06:24 IST

పెబ్బేరు మార్కెట్‌ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
పక్క కంపార్ట్‌మెంట్లలోని ధాన్యానికీ వ్యాపించిన మంటలు

పెబ్బేరు, న్యూస్‌టుడే: వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్‌ యార్డులోని గోదాంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగి రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. యార్డులోని గోదాంలో రెండో కంపార్ట్‌మెంటును జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు లీజుకు తీసుకుని 12.88 లక్షల గోనె సంచులు(గన్నీ బ్యాగులు) నిల్వ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు నేపథ్యంలో వీటిని సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఇందులో మంటలు చెలరేగి సంచులన్నీ కాలిపోయాయి. మిల్లర్ల యజమానులు ఒకటో కంపార్ట్‌మెంటులో 14 వేల బస్తాలు, మూడో కంపార్ట్‌మెంటులో 63 వేల బస్తాల సీఎంఆర్‌ ధాన్యాన్ని భద్రపరిచారు. మధ్యలో ఉన్న రెండో కంపార్ట్‌మెంటులో భారీగా మంటలు చెలరేగడంతో పక్కనున్న వీటికీ వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపకశాఖ వాహనం వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావడం లేదు. అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మార్కెటింగ్‌ జిల్లా అధికారి స్వరణ్‌సింగ్‌, ఆర్డీవో రాజేశ్వరి, తహసీల్దారు లక్ష్మి, పుర కమిషనర్‌ ఆదిశేషులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, నష్టం విలువ అగ్నికీలలు చల్లారితే తప్ప చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. గన్నీ సంచుల విలువ మాత్రం రూ.9 కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం, సంభవించిన నష్టంపై నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని