అగ్ని ప్రమాదంలో రూ.15 కోట్ల నష్టం!

వనపర్తి జిల్లా పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

Updated : 03 Apr 2024 04:39 IST

పెబ్బేరు గోదాంలో కాలిపోయిన ధాన్యం, గోనె సంచులు

పెబ్బేరు, న్యూస్‌టుడే: వనపర్తి జిల్లా పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. గోదాంలో సోమవారం సాయంత్రం పెద్దఎత్తున మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రికి కూడా పూర్తిస్థాయిలో చల్లారలేదు. ఏబీడీ లిక్కర్‌ కంపెనీకి చెందిన భారీ ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి అగ్నిమాపక వాహనాల ద్వారా సిబ్బంది రాత్రీ పగలూ శ్రమించారు. భారీ యంత్రాలతో గోదాం గోడలను కూల్చివేసి.. కాలిపోయిన గోనె సంచులను బయటకు తీశారు. గోదాంలో మూడు కంపార్ట్‌మెంట్లు ఉండగా ఒకదానిలో పౌర సరఫరాల శాఖకు చెందిన గోనె సంచులున్నాయి. మిగతా రెండు కంపార్ట్‌మెంట్లలో మిల్లర్లకు సంబంధించిన సీఎంఆర్‌ ధాన్యం నిల్వ చేయగా సుమారు 20 శాతానికి పైగానే కాలిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

మొత్తం ధాన్యం విలువ సుమారు రూ.7 కోట్లు కాగా.. ఇందులో రూ.2 కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.  గోదాంలో పౌరసరఫరాలకు సంబంధించిన దాదాపు 12.85 లక్షల గోనె సంచులు కాలిపోగా.. వీటి విలువ రూ.9.25 కోట్లు. 2018లో రూ.3.75 కోట్లతో నిర్మించిన ఆధునిక వ్యవసాయ గోదాం కూడా ధ్వంసమైంది. వీటితో సహా అగ్ని ప్రమాదంలో మొత్తం రూ.15కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాద ఘటనపై హైదరాబాద్‌కు చెందిన ఫోరెన్సిక్‌ బృందం వచ్చి పరీక్షించింది. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో సంబంధిత సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. మహబూబ్‌నగర్‌ అదనపు ఎస్పీ రాములు, హైదరాబాద్‌కు చెందిన వ్యవసాయ మార్కెట్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఇఫ్తేకార్‌ నదీమ్‌, వనపర్తి అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఘటన వివరాలను సేకరించారు. మిల్లుల యజమానులను, అక్కడ ఉండే సిబ్బందిని పిలిపించి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని