పెళ్లితో ఒక్కటయ్యారు.. భయంతో తనువు చాలించారు

ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇంట్లో వారికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మైనర్‌ కావడం, పెద్దలు ఏమంటారోననే భయంతో ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లిలో చోటు చేసుకుంది.

Published : 03 Apr 2024 06:20 IST

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట

కొందుర్గు, న్యూస్‌టుడే: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇంట్లో వారికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మైనర్‌ కావడం, పెద్దలు ఏమంటారోననే భయంతో ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాసిపల్లికి చెందిన కావలి శ్రీకాంత్‌(24) షాద్‌నగర్‌లోని ఓ కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. అతనికి రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత నెల 27న పెద్దలకు తెలియకుండా యాదగిరిగుట్టలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం అదే నెల 30న ఉత్తరాసిపల్లిలోని శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లారు. తరువాత మాట్లాడుదామనే ఉద్దేశంతో పెద్దలు అప్పటికి ఏమీ అనలేదు. అయితే అమ్మాయి మైనర్‌ అయినందున తమ వివాహాన్ని రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో అదేరోజు రాత్రి గ్రామంలోని విద్యుత్‌ ఉపకేంద్రం వద్దకు వెళ్లి ఇద్దరూ పురుగు మందు తాగారు. గమనించిన శ్రీకాంత్‌ కుటుంబసభ్యులు వెంటనే వారిని షాద్‌నగర్‌ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 1న బాలిక, 2న శ్రీకాంత్‌ మృతిచెందారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని