ముగ్గురి ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు

కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. అదనపు కట్నం కావాలని అత్తింటి వారి వేధింపులు.. భర్తతో గొడవలు తాళలేక ఏడాది వయసున్న బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Updated : 03 Apr 2024 07:25 IST

11 నెలల కుమారుడు సహా తల్లి ఆత్మహత్య
మనస్తాపంతో ఆమె తల్లి సైతం బలవన్మరణం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. అదనపు కట్నం కావాలని అత్తింటి వారి వేధింపులు.. భర్తతో గొడవలు తాళలేక ఏడాది వయసున్న బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరి మృతితో ఆవేదనకు గురైన ఆమె తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్‌ సమీపంలోని బొమ్మకల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ కథనం, పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. బొమ్మకల్‌లోని విజయనగరి కాలనీలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరాచారి, జయప్రద(51)లకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. రెండో కుమార్తె శ్రీజ(27)కు మూడేళ్ల కిందట వరంగల్‌కు చెందిన ముగ్ధుంపూర్‌ నరేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో రూ.3 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చారు. నరేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో కుటుంబం హైదరాబాద్‌లో నివాసముంటోంది.

నరేశ్‌, శ్రీజలకు 11 నెలల కుమారుడు రేయాన్ష్‌ అలియాస్‌ అర్విన్‌ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతోపాటు అదనపు కట్నం కావాలని అత్త సుజాత, మామ కేశవాచారి వేధించేవారు. ముగ్గురూ కలిసి మానసికంగా వేధించడంతోపాటు కొట్టి అయిదు రోజుల క్రితం బాబుతో పాటు శ్రీజను పుట్టింటికి పంపారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మంగళవారం ఉదయం అత్తమామలు, భర్త ఫోన్‌ చేసి.. మరో నెల రోజుల్లో కుమారుడి పుట్టినరోజు వేడుకలపై మాట్లాడారు. ‘పుట్టినరోజు వేడుకలు నువ్వే చేసుకో.. మేము రాము’ అంటూ వారు దూషించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీజ తన కుమారుడికి గుర్తుతెలియని మాత్రలు మింగించి, తానూ వేసుకుంది. వారిని ఆమె తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీజకు చికిత్స మొదలుపెట్టారు. కాసేపటికే ఆమె కూడా మృతి చెందింది.

చికిత్స జరుగుతున్న సమయంలో ఇంటికి వెళ్లిన జయప్రద కుమార్తె వేసుకున్న మాత్రల్లో మిగిలినవాటిని వేసుకుంది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను పక్కింటివారు గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య, కుమార్తె, మనవడి మృతితో వెంకటేశ్వరాచారి గుండెలు బాదుకొని రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది. ఆయన ఫిర్యాదు మేరకు శ్రీజ భర్త నరేశ్‌, అత్తమామలు సుజాత, కేశవచారిలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌ తెలిపారు. ఆత్మహత్యకు ఉపయోగించిన మాత్రలను శ్రీజ యూట్యూబ్‌లో వెతికి.. ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని