దద్దరిల్లిన దండకారణ్యం.. 12 మంది మావోయిస్టుల మృతి

దండకారణ్య ప్రాంతం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్‌ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయి. దీని గురించి అందిన సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

Updated : 03 Apr 2024 06:19 IST

 ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది.. మధ్యప్రదేశ్‌లో ఇంకో ఇద్దరు
దుమ్ముగూడెం - న్యూస్‌టుడే

దండకారణ్య ప్రాంతం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్‌ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయి. దీని గురించి అందిన సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపుర్‌ జిల్లాలో మావోయిస్టులు పలు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి నుంచి బస్తర్‌ ఫైటర్స్‌, డీఆర్జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బలగాలు సంయుక్తంగా లేంద్రా, కోర్చోలీ, సావనార్‌ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ చేపట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కోర్చోలీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోయిస్టు దళాలు కాల్పులు జరపడంతో.. బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య దాదాపు 3 గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారి కోసం బలగాలు గాలింపు చేపట్టగా.. మరో ఆరు మృతదేహాలు లభించాయి. మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకొని పారిపోయి ఉంటారని పోలీస్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

ఘటన స్థలంలో బ్యారల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌, ఎల్‌ఎంజీ, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. మావోయిస్టులు ఏటా వేసవిలో మార్చి నుంచి జూన్‌ మధ్య టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌(టీసీవోసీ) నిర్వహించి.. తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తారని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ విలేకరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏడు జిల్లాలతో కూడిన బస్తర్‌ నియోజకవర్గం పరిధిలో భద్రతా బలగాలపై పెద్దఎత్తున దాడులకు వ్యూహం రూపొందించారని పేర్కొన్నారు. బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 43 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించారు. బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.

మధ్యప్రదేశ్‌లో..

ఛత్తీస్‌గఢ్‌-మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లా కేరజారి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో డివిజనల్‌ కమిటీ సభ్యురాలు(డీసీఎం) సజంతి అలియాస్‌ క్రాంతి(35), ఏరియా కమిటీ సభ్యుడు(ఏసీఎం) రఘు అలియాస్‌ షేర్‌సింగ్‌(40) ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47, 12-బోర్‌ రైఫిల్‌, కిట్‌ బ్యాగులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనను బాలాఘాట్‌ ఎస్పీ సమీర్‌ సౌరబ్‌ ధ్రువీకరించారు. సజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని