సీఎం సహాయనిధి చెక్కుల సొమ్ము కాజేతపై మరో కేసు

బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల సొమ్ము కాజేసిన వ్యవహారానికి సంబంధించి జూబ్లీహిల్స్‌ ఠాణాలో మరో కేసు నమోదైంది.

Published : 04 Apr 2024 03:19 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల సొమ్ము కాజేసిన వ్యవహారానికి సంబంధించి జూబ్లీహిల్స్‌ ఠాణాలో మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఓ కేసు నమోదవగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. తాజా కేసులో ఇప్పటికే అరెస్టయిన నలుగురితోపాటు మరో మహిళ నిందితులుగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం పటేల్‌గూడెం ప్రాంతానికి చెందిన లక్ష్మికి హనుమకొండలో శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి రూ.1,36,498 ఖర్చవగా సీఎం సహాయనిధి కింద 2023లో దరఖాస్తు చేశారు. అప్పటి ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు కార్యాలయానికి వెళ్లి ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సచివాలయానికి వెళ్లగా రూ.60 వేలు మంజూరైనట్లు తెలిసింది. గత నెల 28న ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తను గమనించి తమ చెక్కును కాజేశారని గ్రహించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన నరేశ్‌కుమార్‌, వంశీ, వెంకటేశ్‌గౌడ్‌, ఓంకార్‌లతోపాటు స్వరూప అనే మహిళ, మరికొందరిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరో రెండు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని