టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావుపై మరో కేసు

టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదైంది. తన కుమార్తె పేరిట కొనుగోలు చేసిన ఫ్లాటు సేల్‌ డీడ్‌ను బలవంతంగా రద్దు చేయించారని సుదర్శన్‌కుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 04 Apr 2024 07:55 IST

ఫ్లాటు రిజిస్ట్రేషన్‌ రద్దు కోసం నిర్బంధించి కొట్టారని ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదైంది. తన కుమార్తె పేరిట కొనుగోలు చేసిన ఫ్లాటు సేల్‌ డీడ్‌ను బలవంతంగా రద్దు చేయించారని సుదర్శన్‌కుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రాధాకిషన్‌రావుతో పాటు.. ఎంవీ రాజు, విశ్వనాథరాజు మరికొందరి పేర్లను జాబితాలో చేర్చారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి విజయనగర్‌ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్‌కుమార్‌ (52) వ్యాపారి. ఆయన స్నేహితులు ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఎంవీ రాజు, సనత్‌నగర్‌కు చెందిన ఏవీకే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌లో పెట్టుబడి పెడితే 10 శాతం వాటా ఇస్తామని సుదర్శన్‌కు సూచించారు. సుదర్శన్‌ రూ.60 లక్షలు ఇవ్వగా 2019లో సనత్‌నగర్‌ జెక్‌ కాలనీలోని అపార్టుమెంటులో ఫ్లాటు ఇచ్చారు.

దీన్ని సుదర్శన్‌ తన కుమార్తె పేరు మీద రిజిస్టర్‌ చేయించి.. అందులోనే నివసిస్తున్నారు. రెండు నెలల తర్వాత సుదర్శన్‌కు ఎంవీ రాజు ఫోన్‌ చేసి.. ఫ్లాటు ఇచ్చినందుకు అదనంగా రూ.5 లక్షలు రావాల్సి ఉందని  బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత టాస్క్‌ఫోర్సు పోలీసులు సుదర్శన్‌ ఇంటికొచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండు రోజులు అక్కడే నిర్బంధించి బెల్టులతో కొట్టారు. ఓఎస్డీ రాధాకిషన్‌రావు సుదర్శన్‌తో అసభ్యంగా మాట్లాడాడు. వెంటనే ఫ్లాటు ఖాళీ చేయాలని.. లేకుంటే రాజు చంపేస్తాడని బెదిరించాడు. భయపడ్డ సుదర్శన్‌.. ఫ్లాటు సేల్‌ డీడ్‌ రద్దు చేయించారు. ఇన్నాళ్లూ భయంతో మౌనంగా ఉన్న సుదర్శన్‌.. తాజాగా కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏడు రోజుల కస్టడీ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్‌రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఆయనను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. ఏడు రోజులకు కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు ఆయనను గురువారం చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకుని, ఈ నెల 10వ తేదీ వరకు ప్రశ్నించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని