ఆర్గానిక్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆయిల్‌ బాయిలర్‌ పేలిన ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌, నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 04 Apr 2024 05:39 IST

ఆయిల్‌ బాయిలర్‌ పేలి డైరెక్టర్‌, నలుగురు కార్మికుల దుర్మరణం
16 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లో ప్రమాదం
ఘటనపై సీఎం రేవంత్‌ సమీక్ష

హత్నూర, నర్సాపూర్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆయిల్‌ బాయిలర్‌ పేలిన ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌, నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. ఆయిల్‌ బాయిలర్‌ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్‌ రవిశర్మ(38) (హైదరాబాద్‌), కార్మికుల్లో తమిళనాడుకు చెందిన దయానంద్‌(48), విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం(36), మధ్యప్రదేశ్‌కు చెందిన సురేష్‌ పాల్‌(54) మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అధికారికంగా ప్రకటించారు. చందాపూర్‌ గ్రామానికి చెందిన చాకలి విష్ణు(35)ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తీవ్ర గాయాలైనవారిని అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు, సామగ్రి ధ్వంసమయ్యాయి. మృతుల శరీర భాగాలు ఛిద్రమై భీతావహ పరిస్థితి నెలకొంది. పరిశ్రమలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 60 మంది వరకు కార్మికులు విధుల్లో ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. పేలుడు శబ్దం సుమారు 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. కాగా, శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రాత్రి వరకు ఎస్పీ రూపేశ్‌ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.

అమ్మోనియా రసాయనాలు ఉండటంతోనే..

ప్రమాదం జరిగిన ప్రదేశంలో అమ్మోనియా రసాయనాలు ఉండటంతో పేలుడు తీవ్రత పెరిగిందని అగ్నిమాపక జిల్లా అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మంటల్ని అదుపు చేసేందుకు స్థానిక పరిశ్రమల నుంచి, నర్సాపూర్‌, సంగారెడ్డి నుంచి అగ్నిమాపక శకటాలు తెప్పించారు. సంఘటనా స్థలాన్ని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి, భాజపా నేత రఘునందన్‌రావు, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, జిల్లా రీజినల్‌ అధికారి హరివర్ధన్‌రెడ్డి సందర్శించారు.

సహాయక చర్యలకు సీఎం ఆదేశం

ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలను అదుపులోకి తీసుకురావాలని అగ్నిమాపక అధికారులను  ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు.

గవర్నర్‌, కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది చాలా విషాదకర ఘటన అని.. బాధితులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

మృతుల కుటుంబాలకు భారాస అధినేత కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఘటనపై  మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు.


బాధితులకు అండగా ఉంటాం: కొండా సురేఖ, రాజనర్సింహ

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పరిశ్రమను సందర్శించి ప్రమాదం జరిగిన తీరుపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను దామోదర్‌ రాజనర్సింహ పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.  బాధితులకు అండగా ఉంటామన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని