తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

‘అమ్మా.. నాన్నకి ఫోన్‌ చేయవా..’ అని ఉదయం లేవగానే అడిగిన చిన్నారికి ఇప్పుడు వచ్చేస్తారమ్మా అని తల్లి చెప్పింది. అలా అన్న కొద్దిసేపటికే గుండెలు పగిలేలా.. భర్త మరణ వార్త ఆమె చెవిన పడింది.

Updated : 12 Apr 2024 06:34 IST

మృతుడు విజయనగరం జిల్లా వాసి

విశాఖపట్నం (గురుద్వారా), న్యూస్‌టుడే: ‘అమ్మా.. నాన్నకి ఫోన్‌ చేయవా..’ అని ఉదయం లేవగానే అడిగిన చిన్నారికి ఇప్పుడు వచ్చేస్తారమ్మా అని తల్లి చెప్పింది. అలా అన్న కొద్దిసేపటికే గుండెలు పగిలేలా.. భర్త మరణ వార్త ఆమె చెవిన పడింది. డ్యూటీ నుంచి నాన్న వచ్చే సమయం కావడంతో అమాయకంగా ఎదురుచూస్తున్న పిల్లలకు ఇక ఎప్పటికీ రారనే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక తల్లి గుండెలు పగిలేలా రోదించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశా గ్రామానికి చెందిన పాలవలస శంకర్రావ్‌(37) 2010లో ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఏపీఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం విశాఖపట్నం ద్వారకానగర్‌లోని ఓ బ్యాంకు శాఖలో కాపలాదారుగా పనిచేస్తున్నారు.

భార్య శ్రావణికుమారి(30), కుమారుడు కిశోర్‌ చంద్రదేవ్‌(5), కుమార్తె(2)తో కలిసి శివాజీపాలెంలో నివసిస్తున్నారు. శంకర్రావ్‌ గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యారు. సుమారు 6 గంటల ప్రాంతంలో పనిచేస్తున్న చోటే కూర్చొని తుపాకీని గుండె వైపు పెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడున్న సిబ్బంది ఆ సమాచారాన్ని ద్వారకా పోలీసులకు అందించారు. ఏసీపీ రాంబాబు, సీఐ రమేశ్‌, ఎస్‌.ఐ ధర్మేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఆత్మహత్య ఘటన దృశ్యాల్ని చూశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఏసీపీ రాంబాబు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని