తెదేపా తరఫున ఇఫ్తార్‌ విందు ఇచ్చారని దాడి

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి.

Published : 13 Apr 2024 05:29 IST

పల్నాడు జిల్లాలో ఘటన

రెంటచింతల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందట సిద్ధం సభకు రాలేదని తెదేపా సానుభూతిపరుడు, ఎస్టీ యువకుడిపై దాడి చేసిన ఘటన మరువకముందే మరోసారి వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల మండలం తుమృకోటలో ఈ నెల 5న తెదేపా కార్యకర్త పఠాన్‌ జలీల్‌ఖాన్‌ ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డిని పిలిచారు. విందు తర్వాత ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. దీంతో స్థానిక వైకాపా నాయకులు జలీల్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం గ్రామంలోని మసీదు సమీపంలో అరుగుపై కూర్చుని మాట్లాడుతున్న జలీల్‌ఖాన్‌పై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారు. ‘ఊరిలోకి తెదేపా నాయకులను పిలుస్తావా? వారికి ఇఫ్తార్‌ విందు ఇస్తావా?’ అంటూ కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో జలీల్‌ఖాన్‌కు, ఘటన సమయంలో పక్కనే ఉన్న ఆయన స్నేహితుడు చాంద్‌బాషాల తలలకు బలమైన గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితులను బ్రహ్మారెడ్డి పరామర్శించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మసీదు వీధిలో దుకాణాలన్నింటినీ మూయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని