అవంతి ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు బీభత్సం

మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయరహదారిపై శుక్రవారం బీభత్సం సృష్టించింది.

Updated : 13 Apr 2024 06:59 IST

రహదారికి పక్కగా ఉన్నవారిపై నుంచి దూసుకుపోయిన వైనం
బాలుడి దుర్మరణం.. 10 మందికి గాయాలు

అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయరహదారిపై శుక్రవారం బీభత్సం సృష్టించింది. రహదారికి పక్కగా ఉన్నవారి పైనుంచి దూసుకుపోయి పన్నెండేళ్ల బాలుడిని బలితీసుకోగా, పది మందిని గాయపరిచింది. 4 ద్విచక్ర వాహనాలను, ఒక కారును, సంచార అల్పాహార వాహనాన్ని ధ్వంసం చేసింది. కశింకోట సీఐ వినోద్‌బాబు కథనం ప్రకారం.. పెందుర్తికి చెందిన ముస్లింలు కుటుంబసభ్యులతో కలసి కారులో పిఠాపురం వెళ్తున్నారు. జాతీయరహదారికి పక్కగా ఉన్న అల్పాహార వాహనం వద్ద ఆగారు. ఈ సమయంలో అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళ్తున్న అవంతి కళాశాల బస్సు వీరి మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో షేక్‌ గౌస్‌ ముదీనా (12) మృతిచెందాడు. ఇతని తల్లి మున్నీ, తండ్రి రెహమాన్‌, షేక్‌ షరీబా, సయ్యద్‌ బాబ్జీ, అలీ హస్సేన్‌, ఎస్‌.రామకృష్ణలకు గాయాలయ్యాయి. వీరిలో మున్నీ, రామకృష్ణలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రహదారి పక్కన ఫలహారం తింటున్న గొన్నాబత్తుల లక్ష్మి, కరణం లక్ష్మణరావు, గొల్లవిల్లి రమణమ్మ, కర్రి అనిల్‌కుమార్‌లకు గాయలవ్వగా వీరిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సును డ్రైవర్‌ వేగంతో పాటు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

కుమార్తెకు వివాహం ఖరారు కావడంతో..

పెందుర్తికి చెందిన రెహమాన్‌ మాంసం దుకాణం నిర్వహిస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె బషీరాకు ఈ నెల 26న వివాహం ఉండటంతో కుటుంబసభ్యులతో కలసి దర్గాలో పూజలు చేసి పిఠాపురంలోని బషీరమ్మ దర్శనానికి కారులో బయలుదేరారు. ఫలహారం కోసం ఆగిన సమయంలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అనకాపల్లి లోక్‌సభ ఉమ్మడి భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌, అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని