మేఘా ఇంజినీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు

ఛత్తీస్‌గఢ్‌లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌)పై రాయ్‌పుర్‌ సీబీఐ కేసు నమోదు చేసింది.

Updated : 14 Apr 2024 06:54 IST

ఎన్‌ఐఎస్‌పీ ప్రాజెక్టు పనుల్లో లంచం ఇచ్చారని అభియోగం

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌)పై రాయ్‌పుర్‌ సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితుల జాబితాలో 12వ స్థానంలో మేఘా సంస్థను చేర్చింది. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్‌ స్టీల్‌ ఆధ్వర్యంలోని మెకాన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరిపైనా కేసు నమోదైంది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా నాగర్నార్‌లోని ఎన్‌ఎండీసీ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఎస్‌పీ) ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల జారీ విషయంలో అధికారులకు మేఘా లంచమిచ్చిందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్‌ఎండీసీ విశ్రాంత ఈడీ ప్రశాంత్‌ దశ్‌, జీఎం(ఫైనాన్స్‌) రాజశేఖర్‌, మేనేజర్‌(ఫైనాన్స్‌) సోమ్‌నాథ్‌ ఘోష్‌, ఎన్‌ఐఎస్‌పీ డైరెక్టర్‌(ప్రొడక్షన్‌) దిలీప్‌కుమార్‌ మొహంతి, డీజీఎం ప్రదీప్‌కుమార్‌ భూయాన్‌, డిప్యూటీ మేనేజర్‌ నరేశ్‌బాబు, సీనియర్‌ మేనేజర్‌ సువ్రో బెనర్జీ, సీజీఎం కృష్ణమోహన్‌, మెకాన్‌ సంస్థ విశ్రాంత ఏజీఎం(కాంట్రాక్ట్స్‌) సంజీవ్‌ సహాయ్‌, విశ్రాంత డీజీఎం(కాంట్రాక్ట్స్‌) ఇలవరుసు, మేఘా జీఎం సుభాష్‌చంద్ర సంగ్రాస్‌, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌పై ఈ కేసు నమోదు చేశారు.

ప్రాజెక్టుకు సంబంధించి ఇన్‌టేక్‌వెల్‌, పంప్‌హౌస్‌, తాగునీటి శుద్ధి ప్లాంటు, క్రాస్‌కంట్రీ పైప్‌లైన్‌ నిర్మాణ పనులతోపాటు ఐదేళ్ల నిర్వహణ కోసం 2015లో రూ.314.57కోట్ల విలువైన కాంట్రాక్టును ఎన్‌ఎండీసీ... ఎంఈఐఎల్‌, కోయా అండ్‌ కంపెనీ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌(కేసీసీఎల్‌)తో కూడిన కన్సార్షియంకు అప్పగించింది. కాంట్రాక్టులో భాగంగా 2018 డిసెంబరు నాటికి 73 ఇన్వాయిస్‌ల ద్వారా ఎంఈఐఎల్‌కు రూ.174.41కోట్లను చెల్లించారు. ఈ ఇన్వాయిస్‌లను ప్రాసెస్‌ చేసినందుకు ఎన్‌ఎండీసీ అధికారులకు రూ.73.85లక్షలు.. అందులో భాగమైన మెకాన్‌ అధికారులకు రూ.5.01లక్షలు లంచంగా ఇచ్చారనేది అభియోగం. ఈ వ్యవహారంపై ఎన్‌ఎండీసీ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ అంతర్గతంగా విచారణ జరిపి 2023లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31న సీబీఐ కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని