ఎవరికీ రావొద్దు తల్లీ.. ఇలాంటి కడుపుకోత!

పిల్లల ఈత సరదా ముగ్గురు తల్లులకు కడుపుకోత మిగిల్చింది. ముగ్గురూ ఏకైక సంతానం కావడం..వారంతా చెరువులో మునిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో  తీవ్ర విషాదం నెలకొంది.

Published : 14 Apr 2024 05:08 IST

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృత్యువాత
ఏకైక సంతానం కడతేరడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం
నిజామాబాద్‌ జిల్లా ఒడ్యాట్‌పల్లిలో ఘటన

ఒడ్డ్యాట్‌పల్లి (మాక్లూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: పిల్లల ఈత సరదా ముగ్గురు తల్లులకు కడుపుకోత మిగిల్చింది. ముగ్గురూ ఏకైక సంతానం కావడం..వారంతా చెరువులో మునిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో  తీవ్ర విషాదం నెలకొంది. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ఒడ్డ్యాట్‌పల్లిలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి(19), మహేశ్‌(19), నరేశ్‌(18), సాయితేజ(19), వినోద్‌(18)లు గ్రామశివారులో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. లోపలికి దిగిన కొద్దిసేపటికే తిరుపతి, మహేశ్‌, నరేశ్‌లు మునిగిపోయారు. వినోద్‌ కూడా మునిగిపోతుండగా సాయితేజ అతడిని అతి కష్టమ్మీద కాపాడి ఒడ్డుకు చేర్చాడు. వెంటనే ఇరువురూ గ్రామంలోకి పరుగుపెట్టి విషయం స్థానికులకు చేరవేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు ముగ్గురూ వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధీర్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని