వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

తోటి చిన్నారులతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధి కుక్కలు బలితీసుకున్నాయి. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది.

Published : 14 Apr 2024 04:25 IST

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: తోటి చిన్నారులతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధి కుక్కలు బలితీసుకున్నాయి. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ కె.విజయవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లా కోప్రా గ్రామానికి చెందిన విశ్వప్రసాద్‌, పుష్పబాయి దంపతులు సుచిత్ర సమీపంలోని బీమ్‌ కాలమ్స్‌ భవన నిర్మాణ సంస్థలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంతో కలిసి అక్కడే రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. శుక్రవారం విశ్వప్రసాద్‌, పుష్పబాయి పనికి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు తోటి పిల్లలతో కలిసి వారి చిన్న కూతురు దీప్‌కుమారి షెడ్డు ముందు ఆడుకుంటుండగా.. రెండు శునకాలు కొట్లాడుకుంటూ అక్కడికి వచ్చి బాలిక తల, చేతులను తీవ్రంగా గాయపర్చి కొద్దిదూరం లాక్కెళ్లాయి. అక్కడ మరో రెండు శునకాలు తోడై మరింత గాయపర్చాయి. ఈ ఘటనను చూసిన ఇతర పిల్లలు భయంతో తమ తల్లిదండ్రుల వద్దకు పరుగులు తీశారు. వెంటనే తల్లిదండ్రులు అక్కడికి రావడంతో శునకాలు పారిపోయాయి. చిన్నారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిలోఫర్‌ ఆసుపత్రికి సిఫారసు చేశారు. రాత్రి అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని