బెదిరిస్తారు.. దోచేస్తారు!

హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళకు ముంబయి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘కొరియర్‌ సర్వీస్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో తైవాన్‌కు ఒక పార్సిల్‌ వెళుతోంది. అందులో కొన్ని పాస్‌పోర్టులు, మత్తుమందులు ఉన్నాయని తేలింది.

Published : 14 Apr 2024 03:18 IST

సైబర్‌ నేరగాళ్ల నయా పంథా
పార్సిళ్లు, కొరియర్లలో డ్రగ్స్‌ ఉన్నాయంటూ మోసాలు
డబ్బులివ్వకపోతే కేసులు ఎదుర్కోవాలంటూ వసూళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళకు ముంబయి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘కొరియర్‌ సర్వీస్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో తైవాన్‌కు ఒక పార్సిల్‌ వెళుతోంది. అందులో కొన్ని పాస్‌పోర్టులు, మత్తుమందులు ఉన్నాయని తేలింది. ముంబయి క్రైంబ్రాంచి ఈ కేసు దర్యాప్తు చేస్తోంది’ అని ఆగంతకుడు చెప్పాడు. సంప్రదించాలంటూ ముంబయి క్రైంబ్రాంచి డీసీపీ పేరిట ఓ నంబర్‌ కూడా ఇచ్చాడు. దీంతో భయపడిన ప్రొఫెసర్‌ ఆ నంబరుకు ఫోన్‌ చేశారు. డీసీపీగా చెప్పుకొన్న ఆ వ్యక్తి ప్రొఫెసర్‌కు అంతర్జాతీయ హవాలా వ్యాపారులతో సంబంధాలున్నాయని బెదిరించి, ఆమె ఖాతా నుంచి రూ.36.7 లక్షలు లూటీ చేశాడు. ఆలస్యంగా మోసం గ్రహించిన ఆమె సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • మాదాపూర్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి ముంబయి కస్టమ్స్‌ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘మీ ఆధార్‌కార్డు ఇతర వివరాలున్న పార్సిల్‌ చైనా నుంచి వచ్చింది. అందులో కొకైన్‌ ఉంది’ అని చెప్పాడు. భయపడిన ఆ యువతి కేసు నమోదవకుండా చూడాలంటూ బతిమలాడింది. దీంతో ఆమెను కేసు నుంచి తప్పిస్తానని మాయమాటలు చెప్పిన నేరగాడు ఒకేరోజు రూ.19.5 లక్షలు కాజేశాడు.
  • సైబర్‌ నేరగాళ్ల నయా పంథా ఇది. మాయమాటలు చెప్పి.. బెదిరించి.. పెద్దఎత్తున దోచేస్తున్న ఉదంతాలెన్నో ఇటీవల బయటపడుతున్నాయి. నేరగాళ్లు సీబీఐ, ఈడీ, కస్టమ్స్‌ వంటి పేర్లు చెప్పి సామాన్యులను హడలెత్తిస్తున్నారు. ఒకప్పుడు లాటరీ వచ్చిందనో.. మరేదో ఆశపెట్టి దోచుకునే సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు భయపెట్టి లూటీ చేయడం మొదలుపెట్టారు. ఎదుటివారు ఆలోచించేందుకు సమయం ఇవ్వకుండా చాకచక్యంగా బోల్తా కొట్టిస్తున్నారు. సీబీఐ కేసు నమోదయిందని, మత్తుమందుల పార్సిల్‌ వచ్చిందని రకరకాలుగా బెదిరిస్తున్నారు. తర్వాత ఇలాంటి కేసుల నుంచి బయటపడాలంటే డబ్బు కట్టాలంటా బెదిరించి దోచేస్తున్నారు. ‘ఆశపడి మోసపోవద్దు..’ అంటూ పోలీసులు సాగించిన ప్రచారం సత్ఫలితాన్ని ఇస్తుందని సంతోషిస్తున్న తరుణంలో కొత్తగా మొదలైన ఈ తరహా సైబర్‌ మోసాలు పరిస్థితిని మళ్లీ దిగజారుస్తున్నాయి. ప్రజల్లో భావోద్వేగాలే సైబర్‌ నేరగాళ్లకు పెట్టుబడి. ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ వినియోగం విస్తృతమైన నేపథ్యంలో ఈ తరహా మోసాలు పరాకాష్ఠకు చేరాయి. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా బలవుతోంది ఉన్నత విద్యావంతులు, ఉన్నతోద్యోగులే కావడం గమనార్హం. మోసగాళ్ల నుంచి కాల్స్‌ రాగానే ముందూవెనుకా ఆలోచించకుండా వారి ఉచ్చులో పడుతున్నారు. ఒకవేళ పోలీసు కేసయితే పరువు పోతుందన్న భయం కూడా వారికే ఎక్కువ ఉంటుందని, అందుకే నేరగాళ్లు ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

నమ్మొద్దు.. భయపడొద్దు!

‘ఇలాంటి వాటిని అసలు నమ్మొద్దు. కొద్దిగా మీ వ్యక్తిగత వివరాలు చెప్పగానే నిజమని భావించొద్దు. సైబర్‌ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో చాలామంది వ్యక్తిగత వివరాలు సేకరించి పెట్టుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. పార్సిళ్లు, కొరియర్లు వంటివాటి గురించి చెబితే వెంటనే బెదిరిపోవద్దు. ఒకవేళ ఇలాంటి కాల్స్‌ వస్తే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి’ అని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని