డ్రగ్స్‌ సొమ్ముతో సినిమాలు, దందాలు

డీఎంకే పార్టీ మాజీ నాయకుడు, సినీనిర్మాత జాఫర్‌ సాదిఖ్‌ (36) మాదకద్రవ్యాల అక్రమరవాణా ద్వారా ఆర్జించిన సొమ్ములో రూ.40 కోట్లను చిత్ర నిర్మాణానికి.. హోటల్‌, స్థిరాస్తి వ్యాపారాలకూ మళ్లించాడని  ఈడీ శనివారం ఆరోపించింది.

Updated : 14 Apr 2024 07:14 IST

జాఫర్‌ సాధిఖ్‌పై ఈడీ అభియోగం

దిల్లీ: డీఎంకే పార్టీ మాజీ నాయకుడు, సినీనిర్మాత జాఫర్‌ సాదిఖ్‌ (36) మాదకద్రవ్యాల అక్రమరవాణా ద్వారా ఆర్జించిన సొమ్ములో రూ.40 కోట్లను చిత్ర నిర్మాణానికి.. హోటల్‌, స్థిరాస్తి వ్యాపారాలకూ మళ్లించాడని  ఈడీ శనివారం ఆరోపించింది. సాదిఖ్‌ ‘మంగై’ అనే తమిళ సినిమా తీశాడు. చెన్నైలో ఒక హోటలు నిర్మించాడు. తమిళ, హిందీ చిత్ర ఫైనాన్షియర్లతో అతడికున్న సంబంధాలు, రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చిన వైనాన్ని శోధిస్తున్నామని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) తెలిపింది. రూ.2,000 కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫిడ్రిన్‌ అనే మత్తుకారక రసాయనాన్ని అక్రమంగా రవాణా చేశాడంటూ ఎన్‌.సి.బి. గత నెలలో సాదిఖ్‌ను అరెస్టు చేసింది. సాదిఖ్‌ ముఠా కొబ్బరిపొడి, బలవర్ధక పౌడర్లలో సూడో ఎఫిడ్రిన్‌ను కలిపి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు రవాణా చేసేది. సాదిఖ్‌ కిలో మత్తు పదార్థానికి రూ.లక్ష చొప్పున కమీషన్‌ తీసుకునేవాడని ఎన్‌.సి.బి.  వివరించింది. చెన్నై, మధురై, తిరుచిరాపల్లిలలో గల సాదిఖ్‌ ఆస్తులు, సంబంధీకులపై ఈ నెల 9న ఈడీ దాడులు చేసింది. సాదిఖ్‌ బాగోతం బయటపడగానే గత ఫిబ్రవరిలో డీఎంకే అతణ్ని పార్టీ నుంచి బహిష్కరించింది. సాదిఖ్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలూ లేవని తమిళనాడు న్యాయమంత్రి, డీఎంకె నేత ఎస్‌.రఘుపతి ఇప్పటికే  ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని