ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా దొరికారు

రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు.

Updated : 16 Apr 2024 06:45 IST

అనిశా వలలో మహిళా ఎస్సై, మరో ఇద్దరు అధికారులు
వేర్వేరు జిల్లాల్లో ఘటనలు

ఆసిఫాబాద్‌, నల్గొండ నేరవిభాగం, వరంగల్‌క్రైం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. ఓ కేసు విషయంలో మహిళా ఎస్సై, ఛార్జీ మెమోను ఎత్తివేయడానికి ఆర్టీసీ డిపో మేనేజర్‌, ఔషధ దుకాణ అనుమతి కోసం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, లంచాలు తీసుకుంటూ  అడ్డంగా దొరికారు.

  • కరీంనగర్‌ అనిశా డీఎస్పీ, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్‌ మండలంలోని బూరుగూడలో గత నెల 31న ఓ కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ కేసు విషయంలో స్టేషన్‌ బెయిల్‌ కోసం ఎస్సై రాజ్యలక్ష్మి   రూ.40 వేల లంచం డిమాండ్‌ చేశారు. కారు యజమాని యాహియాఖాన్‌ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు రూ.25 వేలకు ఒప్పుకొన్నారు. బాధితుడు అనిశా అధికారులకు చెప్పడంతో వారు సూచించిన మేరకు సోమవారం ఠాణాలో ఎస్సైకి రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఇతర పోలీసు అధికారులతో వచ్చి పట్టుకొన్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎస్సైని కరీంనగర్‌ అనిశా కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
  • అనిశా డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్‌ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తనపై జారీ అయిన ఛార్జి మెమోను ఎత్తివేయాలని డ్రైవర్‌ రవీందర్‌ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ వద్దకు వెళ్లి అడగ్గా అతను రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో రవీందర్‌ మొదట రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన రూ.20 వేలు ఇచ్చాకే ఛార్జి మెమో ఎత్తేస్తానని శ్రీకాంత్‌ చెప్పడంతో రవీందర్‌ వరంగల్‌ అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో డీఎం శ్రీకాంత్‌కు డబ్బు ఇస్తుండగా అనిశా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.
  • అనిశా డీఎస్పీ జగదీశ్‌ చందర్‌ తెలిపిన వివరాలు..నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం ప్రాంతంలో నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్‌ ఆసుపత్రిలో ఔషధ దుకాణ అనుమతి కోసం ఇన్‌ఛార్జి చిట్టెపు సైదిరెడ్డి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం పరిశీలించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ అనుమతి ఇవ్వడానికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసి చివరకు రూ.18 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనిశా  అధికారులను ఆశ్రయించిన బాధితుడు వారి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నల్గొండలోని ఆయన కార్యాలయంలో కలిసి రూ.18 వేలు ఇచ్చారు. అధికారి నగదు తీసుకుని బ్యాగులో పెడుతుండగా అనిశా అధికారులు పట్టుకుని నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని