బెట్టింగ్‌ దందా ‘ఆట’కట్టు

ఒకేరోజు ఐదు బెట్టింగ్‌ ముఠాల ఆటను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు కట్టించారు. ఐపీఎల్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న స్థావరాలపై సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 15 మంది ఆర్గనైజర్లు, బుకీలను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 16 Apr 2024 04:22 IST

5 స్థావరాలపై దాడులు.. 15 మంది అదుపులోకి
రూ.2.40 కోట్లు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు
బ్యాంకు ఖాతాల్లో మరో రూ.10 కోట్లున్నట్లు గుర్తింపు
ఈనాడు - హైదరాబాద్‌

ఒకేరోజు ఐదు బెట్టింగ్‌ ముఠాల ఆటను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు కట్టించారు. ఐపీఎల్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న స్థావరాలపై సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 15 మంది ఆర్గనైజర్లు, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.33.3 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లోని రూ.2.07 కోట్లు, రూ.88.72 లక్షల విలువైన 75 ఫోన్లు, 8 ల్యాప్‌టాప్‌లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.29 కోట్లు. బెట్టింగ్‌ కోసం నిర్వహిస్తున్న మరో 100 బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.10 కోట్లున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ముఠాల వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా 581 మంది పందెం కాస్తున్నట్లు గుర్తించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, ఎస్‌వోటీ డీసీపీ డి.శ్రీనివాస్‌, అదనపు డీసీపీలు శోభన్‌, శ్రీనివాసరెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో పందెం

ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లు, యాప్‌ల బెట్టింగ్‌ నిర్వహిస్తున్న కూకట్‌పల్లికి చెందిన పొందూరి సురేశ్‌(42)ను శంషాబాద్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ బృందం కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకుంది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా.. బెట్టింగ్‌ కాస్తున్న వికారాబాద్‌కు చెందిన మోత్కుపల్లి రామకృష్ణారెడ్డి(30)ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు నరసరావుపేటకు చెందిన రామాంజనేయులు పరారీలో ఉన్నాడు. నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును స్తంభింపజేశారు. వీటి విలువ రూ.79.99 లక్షలు.

అపార్టుమెంట్లలో..

మియాపూర్‌లోని అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏపీలోని గుంటూరుకు చెందిన కందుకూరి వీరశంకర్‌చారి(42), ఉపాసి వంశీకృష్ణ(30), కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి రాంప్రసాద్‌రెడ్డి(53), నల్గొండ జిల్లాకు చెందిన పబ్బతి మురళి(40)లను ఎస్‌వోటీ మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ దాలినాయుడు బృందం అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిర్వాహకులైన బెంగళూరుకు చెందిన రాజేశ్‌రెడ్డి, దుబాయ్‌లో ఉంటున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సురేశ్‌రెడ్డి, అనంతపురం ప్రాంతానికి చెందిన నాగార్జునరెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన సాదిక్‌(33) పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.44 కోట్ల నగదు, రూ.80 లక్షల విలువైన 36 ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 22 నుంచి 14వ తేదీ మధ్య రూ.15.84 కోట్ల మేర పందెం కాసినట్లు నిందితుల యాప్‌లు, వెబ్‌సైట్లలో పోలీసులు గుర్తించారు.

జీడిమెట్లలో..

జీడిమెట్లలోని హెచ్‌ఏఎల్‌ కాలనీలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన యర్రమచ్చు అజయ్‌కుమార్‌(53), విజయనగరం జిల్లాకు చెందిన అనాదుల మహేశ్‌కుమార్‌ను బాలానగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌ బృందం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి రూ.1.98 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నరేశ్‌ అలియాస్‌ నాని పరారీలో ఉన్నాడు.

క్యాబ్‌ డ్రైవర్‌ దందా

బాచుపల్లిలోని సాయినగర్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న క్యాబ్‌ డ్రైవర్‌, ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోర్తాల శ్రీకాంత్‌రెడ్డి(30), నిజాంపేటకు చెందిన ఐటీ ఉద్యోగి అల్లి లోకేశ్‌(29), కడప జిల్లా చెన్నూరుకు చెందిన వెంకట సునీల్‌(28)ను ఎస్‌వోటీ మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు నీలేశ్‌, బుద్ధారెడ్డి పరారీలో ఉన్నారు.

యాప్‌ల ద్వారా..

యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న దుండిగల్‌లోని మల్లంపేటకు చెందిన చిన్నబాబు, చెన్నంశెట్టి కరీముల్లా షేక్‌ ఖాద్రీ, పనమటి వెంకటేశ్‌, దొండ రమేశ్‌ను శంషాబాద్‌ ఎస్‌వోటీ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడు ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన కల్యాణ్‌ పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.6.05 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు