దద్దరిల్లిన బస్తర్‌

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ ప్రాంతం కాల్పులతో మారుమోగింది.

Updated : 17 Apr 2024 10:29 IST

కాంకేర్‌ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు
29 మంది మావోయిస్టుల మృతి
బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లకు గాయాలు 
సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన
ఆపరేషన్‌కు తెలుగు ఐపీఎస్‌ నేతృత్వం
ఈనాడు, హైదరాబాద్‌-చర్ల, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ ప్రాంతం కాల్పులతో మారుమోగింది. భద్రతాబలగాలతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయాల పాలయ్యారు. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లా ఛోటేబేటియా పోలీసుస్టేషన్‌ పరిధి బినాగుండా-కోరగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బస్తర్‌ లోక్‌సభ స్థానానికి మొదటి దశలో భాగంగా ఈ నెల 19న, కాంకేర్‌ స్థానానికి ఈ నెల 26న పోలింగ్‌ జరగనుంది. ఘటన వివరాలను బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌, జిల్లా ఎస్పీ ఇందిరకల్యాణ్‌ ఎలెసెలా వెల్లడించారు. ఈ ఆపరేషన్‌కు తెలుగు ఐపీఎస్‌ అధికారి అయిన ఇందిరకల్యాణ్‌ నేతృత్వం వహించారు. ఎదురుకాల్పులు ముగిసిన అనంతరం ఆయనతో ‘ఈనాడు’ ఫోన్‌లో మాట్లాడింది. 

60-70 మంది మావోయిస్టుల సమావేశం

‘‘లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టాం. ఈక్రమంలో మంగళవారం తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులకు దిగాం. ఆపరేషన్‌ అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా 29 మృతదేహాలు లభించాయి. వారిలో ముగ్గురిని మావోయిస్టు ఉత్తర బస్తర్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ కేడర్‌ సభ్యులు శంకర్‌రావు, లలిత, వినోద్‌గా గుర్తించాం. మొత్తం 60-70 మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో సమావేశమైనట్లు సమాచారముంది. మావోయిస్టు ఉత్తరబస్తర్‌ డివిజన్‌తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లోని రాజ్‌నంద్‌గాం-కాంకేర్‌-బాలాఘాట్‌ డివిజన్‌ కమిటీ సభ్యులు ఇందులో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆపరేషన్‌ అనంతరం ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌.. తదితర 15 ఆయుధాలు లభ్యమయ్యాయి..’’ అని ఇందిరకల్యాణ్‌ వెల్లడించారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వారిలో సూర్యకాంత్‌ అనే బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రెండు కాళ్లకు తూటాలు తగిలాయి. క్షతగాత్రులను వాయు మార్గంలో రాయ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

  •  మావోయిస్టు కమాండర్‌ శంకర్‌రావుపై రూ.25 లక్షల నజరానా ఉంది. ఎదురుకాల్పుల్లో మంగళవారం మృతి చెందిన శంకర్‌రావు ఆయనే అని ప్రచారం జరిగినా.. అధికారులు నిర్ధారించలేదు.
  • తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఇప్పటివరకూ 79 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ నెల 2న బీజాపుర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.

2018లో 36 మంది.. 2021లో 26 మంది హతం

  • 2018 ఏప్రిల్‌ 22న మహారాష్ట్ర గడ్చిరోలిలోని బామ్రాగఢ్‌ తాలూకా కసన్‌సూర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ భద్రతాదళాల చరిత్రలోనే అతిపెద్దది. అక్కడ ఓ వివాహానికి మావోయిస్టులు హాజరవుతున్నారనే పక్కా సమాచారంతో సీ-60 కమెండోలతో కూడిన భద్రతాదళాలు అంబుష్‌(మాటు) వేశాయి. ఆ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 36 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు.
  • 2021 నవంబరు 14న గడ్చిరోలి జిల్లాలోనే కోట్గుల్‌ మర్దన్‌తోలా అటవీప్రాంతంలోని కోర్చి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అందులో 26 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్‌ తేల్‌తుమ్డే ఉన్నట్లు గుర్తించారు.  ఈ రెండు ఘటనల తర్వాత కాంకేర్‌లో జరిగినదే భారీ ఎన్‌కౌంటర్‌ కావడం గమనార్హం.

భద్రతా బలగాలకు అమిత్‌ షా అభినందనలు 

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభినందనలు తెలిపారు. తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల చర్యలతో ప్రస్తుతం నక్సలిజం చిన్న ప్రాంతానికి పరిమితమైందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సహా యావత్‌ దేశం నుంచి త్వరలోనే మావోయిస్టులు కనుమరుగవుతారని చెప్పారు.

ఎన్‌కౌంటర్‌లో భూపాలపల్లి జిల్లా వాసులు?

చిట్యాల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు మావోయిస్టులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ మురళి, అలియాస్‌ శంకర్‌రావు, ఆయన భార్య, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన దాశశ్వర్‌ సుమన అలియాస్‌ రజిత, రామచంద్రాపురం గ్రామానికి చెందిన రాజులు మావోయిస్టు దళంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఎదురుకాల్పుల్లో వీరు మృతి చెందారని ఇక్కడ ప్రచారం జరిగింది. దీంతో సుధాకర్‌ తల్లి రాజపోచమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఈ వివరాలను స్థానిక పోలీసులు నిర్ధారించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని