పరీక్షలకు అనుమతించలేదని... ఆర్జీయూకేటీలో విద్యార్థి బలవన్మరణం

పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది.

Published : 17 Apr 2024 03:55 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..సిద్దిపేట జిల్లా తొగుట మండలం, బండారుపల్లికి చెందిన విద్యార్థి (17) ప్రస్తుతం పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సెలవులకు ఇంటికెళ్లి ఈ నెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. పీయూసీ పరీక్షలు రాయడానికి కనీస హాజరు 75 శాతం. అతనికి 45 శాతమే ఉండటంతో పరీక్షకు అనుమతించబోమని సోమవారం విశ్వవిద్యాలయం అధికారులు సమాచారమిచ్చారు. ఈ విషయం అతని తల్లిదండ్రులకూ చెప్పారు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లాలని వారికి సూచించారు.

తల్లిదండ్రులను రావద్దని చెప్పి...

విద్యార్థి సోమవారం రాత్రి తండ్రికి ఫోన్‌ చేశాడు. ‘మీరు రావాల్సిన అవసరం లేదని, జరిమానా చెల్లిస్తే పరీక్షకు అనుమతిస్తామన్నారని’ చెప్పాడు. దాన్ని నమ్మిన తండ్రి కుమారుడి ఫోన్‌పేకు రూ.2,000 పంపించి సమస్య పరిష్కారమైందని భావించారు. మంగళవారం ఉదయం సహచర విద్యార్థులంతా తరగతులకు వెళ్లగా.. ఇతను మాత్రం గదిలోనే ఉండిపోయాడు. తరగతులు పూర్తయ్యాక హాస్టల్‌కు వచ్చిన విద్యార్థులు ఉరి వేసుకున్న స్థితిలో స్నేహితుడు కనిపించడంతో అధ్యాపకులకు సమాచారమిచ్చారు. వారు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని