జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా రాహిల్‌

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్‌ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.

Updated : 17 Apr 2024 06:42 IST

అప్పట్లో కారు నడిపింది అతడేనని నిర్ధారణ!
రెండేళ్ల నాటి కేసులో తిరిగి దర్యాప్తు
మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి చుట్టూ ఉచ్చు

ఈనాడు, హైదరాబాద్‌ - జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్‌ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. అప్పట్లో మహారాష్ట్రకు చెందిన కాజల్‌ చౌహాన్‌, ఆమె బంధువులు సారికా చౌహాన్‌, సుష్మా చౌహాన్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర ఫుట్‌పాత్‌ వద్ద నివసిస్తూ బెలూన్లు, స్ట్రాబెర్రీలు విక్రయించేవారు. కాజల్‌కు రెండు నెలల బాబు రణవీర్‌ ఉన్నాడు. 2022 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో వారంతా డివైడర్‌ దాటుతుండగా ఓ కారు ఢీకొట్టింది. ముగ్గురూ గాయపడగా చిన్నారి రణవీర్‌ మృతిచెందాడు. కారులోని ముగ్గురు యువకులూ పరారయ్యారు. ఆ వాహనంపై అప్పటి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాదంపై స్థానిక పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. అప్పట్లో కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్‌ అనే యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. కారులో తనతోపాటు రాహిల్‌, స్నేహితుడు మహమ్మద్‌ మాజ్‌ ఉన్నట్లు అంగీకరించాడు. దీంతో ఆ ఇద్దరి పేర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. స్టీరింగ్‌పై వేలిముద్రలు ఆఫ్రాన్‌ వేలిముద్రలతో సరిపోలాయని పోలీసులు ప్రకటించారు. కాగా గత ఏడాది డిసెంబరులో ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయడమే కాకుండా రాహిల్‌ను ఇటీవల అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్‌ ప్రమాదం కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లోనూ కారు నడిపింది రాహిల్‌ అని, ప్రమాదం జరగ్గానే పరారై తన స్థానంలో ఆఫ్రాన్‌ను ఉంచినట్లు పోలీసులు అనుమానించారు. మహమ్మద్‌ మాజ్‌, బాధితురాలు కాజల్‌ చౌహాన్‌ తదితరుల్ని పిలిపించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వాహనం నడిపింది రాహిల్‌ అని నిర్ధారణకు వచ్చి దర్యాప్తు పునఃప్రారంభించారు. అఫ్రాన్‌ తాజా వాంగ్మూలంలో ప్రమాదం జరిగినప్పుడు కారు నడిపింది రాహిల్‌ అని పేర్కొన్నట్లు తెలిసింది. రాహిల్‌ బంధువులు తానే కారు నడిపినట్లు అంగీకరించాలంటూ  బలవంతంగా ఒప్పించారని చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్సై చంద్రశేఖర్‌ను సైతం ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో విచారించారు. ప్రమాద సమయంలో పనిచేసిన పోలీసు అధికారుల పాత్ర, ప్రమేయంపై పోలీసు ఉన్నతాధికారులు, దర్యాప్తు అధికారులు దృష్టిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని