సిద్ధం సభకు రాయితో వచ్చిన వైకాపా కార్యకర్త

కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా కార్యకర్త ఒకరు రాయితో రావడం కలకలం సృష్టించింది.

Published : 17 Apr 2024 05:57 IST

అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా కార్యకర్త ఒకరు రాయితో రావడం కలకలం సృష్టించింది. ఈ సభలో పాల్గొనేందుకు కంకిపాడు మండలం మంతెన గ్రామం నుంచి బస్సులో కొంతమంది వచ్చారు. వీరికి ఒక్కొక్కరికి రూ.350 ఇచ్చినట్లు సమాచారం. తనకు ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో కోట శరత్‌కుమార్‌ అనే యువకుడు తనను తీసుకొచ్చిన నాయకుడితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భౌతికదాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో శరత్‌కుమార్‌ ఆయనపై రాళ్లతో దాడికి దిగాడని పలువురు చెబుతున్నారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రాయితోనే సభాస్థలి వద్దకు వచ్చేశాడు. తనిఖీల్లో అతడి వద్ద రాయిని గుర్తించిన పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శరత్‌కుమార్‌ మద్యం మత్తులో గ్రామస్థులతో గొడవపడి రాయిని జేబులో ఉంచుకొని సభ వద్దకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల సీఎంపై రాయి దాడి జరిగిన నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని మంగళవారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని