విద్యాదీవెన డబ్బులు రాక.. కుమార్తె హాల్‌టికెట్ కోసం తల్లి ఆత్మహత్యాయత్నం

జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది.

Published : 17 Apr 2024 05:57 IST

విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్‌టుడే: జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. విశాఖ పీఎంపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు అందించిన వివరాలిలా.. నిరుపేదలైన భార్యాభర్తలు నగరంలో ఉంటూ కుమార్తెను పీఎంపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్‌ చదివిస్తున్నారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న ఆమెకు ఈ నెల 19 నుంచి పరీక్షలు ఉండటంతో హాల్‌టికెట్‌ కోసం ఇటీవల కళాశాలకు వెళ్లింది. రూ.25వేల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే ఇస్తామని చెప్పారు. విద్యార్థినికి నెలరోజుల కిందటే జగనన్న విద్యాదీవెన నగదు జమకావాల్సి ఉంది. జాప్యానికి కారణమేంటని విద్యాశాఖాధికారులను అడగ్గా.. కోడ్‌ వల్ల నిధులు రాలేదని చెబుతున్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మంగళవారం కుమార్తెను తీసుకుని తల్లి కళాశాలకు వచ్చింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా నగదు చెల్లిస్తానని, హాల్‌టికెట్‌ ఇవ్వాలని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కుమార్తె వేదన చూడలేని తల్లి కళాశాల వరండాలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ క్రమంలో సంబంధిత విద్యార్థిని 100కు కాల్‌ చేయడంతో పీఎంపాలెం పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. రెండు వారాల్లో రూ.12వేలు చెల్లిస్తానని ఆమె నుంచి హామీపత్రం తీసుకుని విద్యార్థినికి హాల్‌టికెట్‌ అందించారు. జగనన్న విద్యాదీవెన డబ్బులు సమయానికొస్తే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని బాధితురాలు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని