ఎస్సై దాష్టీకాలకు తాళలేక.. చెక్‌పోస్టు చిరుద్యోగి ఆత్మహత్య

ఎస్సై ఒత్తిళ్లు, వేధింపులకు తాళలేక ఓ చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న దారుణమిది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గుండ్లపాలేనికి చెందిన పోకూరి సురేష్‌బాబు(38) వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని తెట్టు చెక్‌పోస్టులో అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.

Published : 17 Apr 2024 06:00 IST

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్సై ఒత్తిళ్లు, వేధింపులకు తాళలేక ఓ చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న దారుణమిది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గుండ్లపాలేనికి చెందిన పోకూరి సురేష్‌బాబు(38) వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని తెట్టు చెక్‌పోస్టులో అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 11న రంజాన్‌ రోజున సురేష్‌ విధుల్లో ఉండగా, ఎస్సై లక్ష్మణ్‌ రాత్రి వేళ అటుగా వచ్చారు. మందు తాగి లారీలు ఆపుతున్నావా అని హెచ్చరిస్తూ రాత్రి 11 గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తాను విధుల్లో ఉన్నానని, లారీలు ఆపలేదని చెప్పినా విన్లేదు. స్టేషన్‌లో కొట్టిన దెబ్బలకు సురేష్‌బాబు కుడి చేతి మణికట్టు ఎముక చిట్లింది. ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ తీసుకొని, తెల్లవారుజామున అతన్ని పంపించారు. పోలీసు దెబ్బలకు భయపడి రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్న సురేష్‌.. తన ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ తీసుకురావాల్సిందిగా బంధువులను కోరారు. వారు వెళ్లి ఠాణాలో అడగ్గా.. సురేష్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేస్తానని ఎస్సై లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. మళ్లీ తాను స్టేషన్‌కు వెళ్తే ఎస్సై కొడతారనే భయంతో సురేష్‌బాబు మంగళవారం ఉదయం ఇంట్లోనే లేఖ రాసి, జేబులో పెట్టుకొని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో.. ‘అక్రమ రేషన్‌ బియ్యం లారీలు వస్తే సమాచారం ఇవ్వాలని ఎస్సై కొద్ది రోజులుగా వేధిస్తున్నారు. రంజాన్‌ రోజు డ్యూటీలో ఉన్న నాపై చేయి చేసుకొన్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారు. నా చావుకు కారణం.. ఎస్సై లక్ష్మణ్‌ సార్‌. నా చావుతోనైనా మీరు మారండి సార్‌’ అని రాసి ఉంది.

గ్రామస్థుల ఆందోళన

సురేష్‌బాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు (8 ఏళ్లు, 3 నెలలు) ఉన్నారు. ఇద్దరు పిల్లలతో సహా స్టేషన్‌కు వచ్చిన మృతుడి భార్య.. తన భర్త చనిపోయే ముందు రాసిన లేఖను చూపిస్తూ తీవ్రంగా విలపించారు. ఎస్సై లక్ష్మణ్‌ కారణంగానే తన భర్త మరణించాడని ఆరోపించారు. గుండ్లపాలెం గ్రామస్థులు సురేష్‌బాబు మృతదేహాన్ని తీసుకువచ్చి ఠాణా ఎదుట ఉంచి, ఆందోళనకు దిగారు. సురేష్‌బాబు మార్కెట్‌ కమిటీ పరిధిలోని చెక్‌పోస్టులో పని చేస్తున్నందున వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాహనాలనే పరిశీలిస్తారు కానీ, బియ్యం రవాణాతో అతనికి సంబంధం లేదు. అయినా ఎస్సై బియ్యం లారీల సమాచారం ఇవ్వాలని ఒత్తిడి తేవడంతోనే చనిపోరని ఆరోపించారు. ఈ పరిణామంతో ఎస్సై లక్ష్మణ్‌ పరారయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని