జువెనైల్‌ హోమ్‌ నుంచి ఎనిమిది మంది పరారీ

కిటికీ గ్రిల్స్‌ తొలగించి జువెనైల్‌ హోమ్‌ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది.

Published : 18 Apr 2024 03:36 IST

కుత్బుల్లాపూర్‌, న్యూస్‌టుడే: కిటికీ గ్రిల్స్‌ తొలగించి జువెనైల్‌ హోమ్‌ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. సూరారం సీఐ వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ నేరాల్లో ప్రమేయమున్న 32 మంది బాలురు హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం బాలురు వరండాలో కూర్చుని పాలు తాగుతుండగా ఇద్దరు గేటు వద్ద ఉన్న కాపలాదారుడిని తోసుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించారు. అతను ప్రతిఘటించినా ఒకరు పారిపోయారు. దీంతో మిగిలిన వారంతా పాల గ్లాసులు కింద పడేసి గందరగోళం సృష్టించారు. ఇదే అదనుగా మరో ఏడుగురు తరగతి గదిలోకి వెళ్లి కిటికీ గ్రిల్స్‌ తొలగించి అందులో నుంచి దూకి పరారయ్యారు. దీనిపై మంగళవారం అర్ధరాత్రి తర్వాత సూపరింటెండెంట్‌ సంగమేశ్వర్‌ సూరారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాలానగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం హోమ్‌ను సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సెక్యూరిటీ సూపర్‌వైజర్లు ప్రీతమ్‌సింగ్‌, అంజిబాబులను సస్పెండ్‌ చేసినట్లు సూపరింటెండెంట్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని