సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు.

Published : 18 Apr 2024 05:25 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన భారాస పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు(48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు కారును స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు.. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టారు. దీంతో జనార్దన్‌రావు ఎగిరి డివైడర్‌ మీద పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదుతో రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసినట్లు సీఐ డానియేల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని