ప్రకాశం జిల్లాలో మద్యం డంప్‌ స్వాధీనం

ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్‌ కార్యాలయంలో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌సునీల్‌ బుధవారం వివరాలను వెల్లడించారు.

Published : 18 Apr 2024 04:39 IST

20.63 లక్షల విలువైన 11,825 సీసాల పట్టివేత
వైకాపా నాయకుడే ప్రధాన సూత్రధారి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్‌ కార్యాలయంలో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌సునీల్‌ బుధవారం వివరాలను వెల్లడించారు. ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులను పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ శ్రీరామ్‌ కొండయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా మండలంలోని పెదఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఈరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంటిని తనిఖీ చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి. పెదఉల్లగల్లు, ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లోని ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఈ కేసులను నిందితులు సేకరించారు. ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వైకాపా ముఖ్య నాయకుడు మేడం రమణారెడ్డి, మద్యం నిల్వ చేసిన మాలకొండారెడ్డి, డ్రైవర్‌ కొండయ్య, వీరికి సహకరించిన చిన్నబాల, మూడు దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు షేక్‌ అంజిబాబు, గండి జక్రయ్య, గోపిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు ఆరుగురు సేల్స్‌మన్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. రమణారెడ్డి, అంజిబాబులు తప్ప మిగిలిన వారిని అరెస్టు చేశామన్నారు. 11,825 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.20.63 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని