అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.

Published : 19 Apr 2024 04:02 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనలు

పాల్వంచ, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పట్టణానికి చెందిన కాంపెల్లి కనకేశ్వరరావు 817/41 సర్వే నంబరులోని మూడు ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.3 వేలు చెల్లించారు. అయితే రూ.30 వేలు లంచం ఇస్తేనే లేఅవుట్‌ అప్రూవ్‌ చేస్తామని పట్టణ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్‌(టీపీఎస్‌) లక్కిరెడ్డి వెంకటరమణి, ఆ విభాగం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పెరబత్తుల ప్రసన్నకుమార్‌ డిమాండ్‌ చేశారు. చివరకు రూ.15 వేలకు అంగీకరించారు. దీంతో కనకేశ్వరరావు అనిశా అధికారులను సంప్రదించారు. వారి సూచనతో వెంకటరమణి, ప్రసన్నకుమార్‌లకు రూ.15 వేలు ఇస్తుండగా డీఎస్పీ రమేశ్‌, సీఐలు శేఖర్‌, సునీల్‌, రామారావుతో కూడిన అనిశా బృందం దాడి చేసి ఉద్యోగులిద్దరినీ పట్టుకుంది.

 భద్రాచలం పట్టణానికి చెందిన సాయితేజ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 12న స్థానికంగా ఓ దుకాణంలో 4 పంచదార బస్తాలు చోరీ చేశారు. వీటిని ఆటోలో తరలిస్తుండగా బ్లూకోల్ట్స్‌ పోలీసులు పట్టుకొని పట్టణ ఠాణాకు తరలించారు. అదేరోజు యువకులను వదిలేసి, బస్తాలను దుకాణ యజమానికి అప్పగించారు. ఆటో, సెల్‌ఫోన్లు మాత్రం ఇవ్వలేదు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ శంకర్‌, సీసీ కెమెరాల ప్రైవేటు టెక్నీషియన్‌ నవీన్‌కుమార్‌ ఆ యువకులను డిమాండ్‌ చేశారు. దీంతో వారు అనిశా అధికారులను సంప్రదించారు. వారి సూచనతో సాయితేజ కానిస్టేబుల్‌ శంకర్‌కు ఠాణా ప్రాంగణంలో రూ.20 వేలు అందజేశారు. అనంతరం కానిస్టేబుల్‌ నుంచి సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్‌ అక్కడికి చేరుకొని సాయితేజకు ఆటో తాళాలు, సెల్‌ఫోన్లు ఇస్తుండగా డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలోని అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. శ్రీనివాస్‌, శంకర్‌, నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు అనిశా సీఐలు మహేశ్‌, శ్యాంసుందర్‌, రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని