మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు

ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్‌ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది.

Published : 19 Apr 2024 04:42 IST

సీఎంఎస్‌ వాహనం నుంచి దొంగలించి దాచిపెట్టిన నిందితుడు
గంటల వ్యవధిలోనే ఛేదించిన ఒంగోలు పోలీసులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్‌ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. సీఎంఎస్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాలుకా పోలీసుల వివరాల మేరకు.. సీఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది నగదును చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్ల్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని వివిధ ఏటీఎంలలో నింపడానికి గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపి, వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులోని గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వాహనం తలుపు తెరిచి ఉండటం గమనించి పరిశీలించగా అందులో కేవలం రూ.100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి.

రూ.500 నోట్ల కట్టలు కనిపించలేదు. తాము తెచ్చిన మొత్తం రూ.68 లక్షల్లో రూ.64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్వీ.శ్రీధర్‌రావు, తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి, వాహనంలోని నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో నిక్షిప్తమయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే.. ఆ వ్యక్తి గతంలో సీఎంఎస్‌ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్‌గా గుర్తించారు. సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెం గ్రామంలో అతడి ఇంటికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటికి సమీపంలోని మర్రిచెట్టు తొర్రలో నగదును దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని