ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!

కంట్రీక్లబ్‌ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్‌ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 20 Apr 2024 05:49 IST

కంట్రీ క్లబ్‌ నిర్వాహకులపై కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: కంట్రీక్లబ్‌ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్‌ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంట్రీక్లబ్‌ గ్రూప్‌ నిర్వాహకులు వై.రాజీవ్‌రెడ్డి, డి.కృష్ణకుమార్‌రాజులపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 406, 420, రెడ్‌విత్‌ 120బీ ఐపీసీ, 5 టీఎస్‌పీడీఎఫ్‌ఈఏ (తెలంగాణ స్టేట్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. 2001లో శ్రీనివాస్‌ చౌదరి కుటుంబం రూ.25 వేలు చెల్లించి క్లబ్‌ సిల్వర్‌ ప్రివిలేజ్‌ మనీబ్యాక్‌ స్కీమ్‌లో చేరింది. గడువు ముగిసినా.. ఆర్థిక పరిమితుల పేరిట డబ్బుల్ని తిరిగి చెల్లించలేమని, బదులుగా ప్లాట్‌ ఇస్తామంటూ నిర్వాహకులు ప్రతిపాదించారు. అందుకోసం 2006లో అదనంగా రూ.1.3 లక్షలు తీసుకున్నా ప్లాట్‌ ఇవ్వలేదు. పలుమార్లు ఒత్తిడి చేయగా చివరకు 2015లో కంట్రీ కుటీరం (ప్రస్తుతం తపోవనం వెంచర్‌)లో 3 ప్లాట్లను కేటాయించి డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట రూ.40 వేలు వసూలు చేశారు. ఏళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. చాలాసార్లు ఒత్తిడి తీసుకురాగా 2023లో ప్లాట్లకు హద్దులు నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాలు సమకూర్చలేకపోయారు. అంతేకాకుండా గత ఏడాది జనవరిలో తప్పుడు పత్రాలతో తపోవనం ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను ఏర్పాటుచేశారు. క్లబ్‌ ఉద్యోగులనే సభ్యులుగా నియమించారు. ప్లాట్‌ యజమానుల నుంచి అదనపు ఛార్జీలను వసూలుచేసే లక్ష్యంతో ఇలాచేశారు. సొసైటీస్‌ రిజిస్ట్రార్‌ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా.. ప్లాట్‌ యజమానులు లీగల్‌నోటీస్‌ పంపినా లెక్కచేయకుండా ఉద్యోగుల ద్వారా ప్లాట్లను అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలకు తెరలేపారు. ఆ అసోసియేషన్‌లో చేరాలంటూ ప్లాట్‌ యజమానులపై ఒత్తిడి పెంచారు. మరోవైపు లక్కీడ్రా ఆఫర్‌ను తెరపైకి తీసుకురావడమే కాకుండా మరో వెంచర్‌లో హౌస్‌ ప్లాట్‌తోపాటు ఫ్రీ లైఫ్‌ క్లబ్‌ మెంబర్‌షిప్‌ పొందొచ్చని ఆశచూపి ఒక్కో యజమాని నుంచి రూ.65 వేల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్‌, డెవలప్‌మెంట్‌ రుసుం కింద అదనంగా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకున్నారు. మరోవైపు క్లబ్‌ చేపట్టిన పలు వెంచర్లు నిబంధనల మేరకు లేవని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ఏళ్లతరబడి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిర్వాహకులపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు