ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి చెందాడు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

Updated : 20 Apr 2024 06:02 IST

జవాన్‌ మృతి, అసిస్టెంట్‌ కమాండెంట్‌కు గాయాలు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి చెందాడు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం బస్తర్‌ పార్లమెంట్‌ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో మావోయిస్టులు పలు చోట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఎన్నికల దృష్ట్యా ఊసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గల్గాం గ్రామానికి దాదాపు 500 మీటర్ల దూరంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు కూంబింగ్‌ చర్యలు చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన యూబీజీఎల్‌ (అండర్‌ బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంఛర్‌) ఒక్కసారిగా పేలడంతో దేవేంద్ర సేధియా(42) అనే జవాన్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని వైద్యం కోసం హెలికాప్టర్‌లో బీజాపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దోబిగూడ గ్రామానికి చెందిన అతను 2013లో ఉద్యోగంలో చేరారు.

బైరాంఘర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిహ్క గ్రామంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చారు. ఎన్నికల బందోబస్తులో భాగంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఈ బాంబులపై సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ మను పొరపాటున అడుగు వేశారు. దాంతో అవి పేలి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వైద్యం కోసం బైరాంఘర్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని