రూ.1.5 కోట్ల విలువైన నల్లమందు స్వాధీనం

భారీ ఎత్తున నల్లమందు సరఫరా చేస్తున్న ముఠాను ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేసి రూ.1.5 కోట్ల విలువ చేసే 160 కిలోల నల్లమందు గడ్డి, ఓ వ్యాన్‌, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Published : 21 Apr 2024 04:19 IST

ధూల్‌పేట, నారాయణగూడ ఆబ్కారీ ఠాణా పరిధుల్లో పట్టివేత

ధూల్‌పేట, న్యూస్‌టుడే: భారీ ఎత్తున నల్లమందు సరఫరా చేస్తున్న ముఠాను ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేసి రూ.1.5 కోట్ల విలువ చేసే 160 కిలోల నల్లమందు గడ్డి, ఓ వ్యాన్‌, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాఖ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ విజయ్‌, సికింద్రాబాద్‌ ఈఎస్‌ పవన్‌కుమార్‌, ఏఈఎస్‌ శ్రీనివాస్‌, ధూల్‌పేట ఎస్‌హెచ్‌వో మధుబాబుతో కలిసి శనివారం ధూల్‌పేట ఆబ్కారీ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. 15 రోజులుగా ధూల్‌పేట, నారాయణగూడ ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధుల్లో నిఘా ఉంచి నల్లమందు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. నల్లమందును రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకొని హైదరాబాద్‌ కేంద్రంగా వేర్వేరు ప్రదేశాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న నల్లమందు ద్వారా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువ చేసే హెరాయిన్‌, కోడిన్‌ తయారు చేసే అవకాశం ఉందన్నారు. రాజస్థాన్‌కు చెందిన దేవేందర్‌ కాసినియా, కె.తేజారామ్‌లను అరెస్టు చేశారు. ముఠాలో కీలకమైన ఫరాస్‌ కాసినియా పరారీలో ఉన్నాడు. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ధూల్‌పేట, నారాయణగూడ ఎస్‌హెచ్‌వోలు మధుబాబు, రామకృష్ణ, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐలు శిరీష, సావిత్రి సౌజన్య పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను అభినందించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని