తక్కువ ధరకు బంగారమంటూ మోసం!.. 13 మంది నుంచి రూ.6.12 కోట్ల వసూలు

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు.

Updated : 21 Apr 2024 09:47 IST

ఏపీలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌, ఏసీపీ సోమనారాయణ సింగ్‌ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతికి చెందిన గంటా శ్రీధర్‌ (40) మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ.. కొండాపూర్‌ మసీదు బండలో కుటుంబంతో నివాసం ఉండేవాడు. సహోద్యోగులు, వారి కుటుంబికులతో పాటు.. కొంపల్లిలో ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు మార్కెట్‌ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలు చేస్తారని.. అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పేవాడు. డబ్బు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత బంగారం డెలివరీ అవుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు బదిలీ చేశారు. మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు. వీరందరికీ కొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు ఇచ్చాడు. సికింద్రాబాద్‌లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్‌ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి.. భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్‌ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా కొండాపూర్‌లోని అతను ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని తిరుపతిలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చి.. శనివారం రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని