రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్‌, భారాస శ్రేణుల ఘర్షణ భారాస కార్యకర్త మృతి

రోడ్డు నిర్మాణం విషయంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం సింగార్‌ బొగుడ తండాలో శనివారం రాత్రి జరిగింది.

Published : 21 Apr 2024 06:04 IST

ముగ్గురికి గాయాలు

కల్హేర్‌, నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: రోడ్డు నిర్మాణం విషయంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం సింగార్‌ బొగుడ తండాలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై మైపాల్‌రెడ్డి, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. తండాకు ఉపాధి పథకం కింద 2023లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు మంజూరైంది. అయితే పనులు చేపట్టడంలో జాప్యం జరిగింది. కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక.. గతంలో నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా మరోచోట రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకు తండావాసులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, భారాస కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఘర్షణకు దారితీసింది. కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో భారాస కార్యకర్త శ్రీను నాయక్‌(25) తీవ్రంగా గాయపడగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీనునాయక్‌ను సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని చెప్పారు. క్షతగాత్రులు నారాయణఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు తండా నుంచి పారిపోయారు. నారాయణఖేడ్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తండాలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరామర్శించారు.  

ఎన్నికల్లో లబ్ధికే హత్యా రాజకీయాలు: భూపాల్‌రెడ్డి

కాంగ్రెస్‌ నాయకులు హత్యా రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని భూపాల్‌రెడ్డి ఆరోపించారు. శనివారం రాత్రి నారాయణఖేడ్‌లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీనునాయక్‌ను కాంగ్రెస్‌ వారు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ వచ్చాక కొత్త పనులు ప్రారంభించకూడదని.. కాంగ్రెస్‌ వారితో అధికారులు కుమ్మక్కై పలు గ్రామాల్లో పనులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. సిర్గాపూర్‌ పీఆర్‌ ఏఈ మాధవనాయుడు, డీఈఈ మధుసూదన్‌రెడ్డిపై హత్యా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని