హైదరాబాద్‌లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం

చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు.

Updated : 22 Apr 2024 07:16 IST

ఘటనా స్థలిలోనే కన్నుమూసిన బాధితురాలు

మూసాపేట, న్యూస్‌టుడే: చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఫలితంగా అధిక రక్తస్రావంతో ఆమె ఘటన స్థలంలోనే కన్నుమూసింది. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ అమానుష ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మూసాపేట వై జంక్షన్‌ సమీపంలోని (బాలానగర్‌ నుంచి కూకట్‌పల్లి రోడ్డు) విష్ణుప్రియ లాడ్జి పక్కనున్న భవనంలో వ్యాపార సముదాయాలున్నాయి. ఆదివారం ఉదయం భవనం సెల్లార్‌లోని ఒక షట్టర్‌ ముందు గుర్తు తెలియని మహిళ (45) మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా.. మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు తీవ్రస్థాయిలో రక్తస్రావమైనట్లు ఆనవాళ్లున్నాయి. మృతదేహం పక్కన ఉన్న ఓ సంచిలో దొరికిన చీటీపై రాసి ఉన్న పేరు ఆమెదే కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంచిలో చిత్తు కాగితాలు ఉండటంతో ఆమె వాటిని ఏరుకుని జీవిస్తుండవచ్చని తెలుస్తోంది. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా.. పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఘటన జరిగిన భవనం పక్కన ఉన్న గల్లీలో కొన్ని నిమిషాల పాటు ఆమెతో మాట్లాడటం కనిపించింది. తర్వాత ఆమెను బలవంతంగా సెల్లార్‌లోని షట్టర్‌ వద్దకు లాక్కెళ్లారు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. వేలిముద్రల నిపుణులు, జాగిలాల బృందం సభ్యులు పలు ఆధారాలను సేకరించారు. కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని